ప్రజా పోరాటాలు చేస్తున్న జగన్‌పై అక్రమ కేసులా?

1 Mar, 2017 23:36 IST|Sakshi
ప్రజా పోరాటాలు చేస్తున్న జగన్‌పై అక్రమ కేసులా?
నేడు మండల కేంద్రాల్లో ఆందోళనలు
వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జిల్లా కన్నబాబు
సాక్షిప్రతినిధి, కాకినాడ : నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు సర్కార్‌ పెడుతున్న అక్రమ కేసులను వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిరసించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ఆయన ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ఓదార్చేందుకు వెళ్లిన జగన్‌ సంఘటన పూర్వపరాలు అడగడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ప్రమాదానికి కారణమైన బస్సు అధికార పార్టీ ఎంపీకి చెందినది కావడంతోనే కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బస్సును నడిపిన డ్రైవర్‌ ప్రమాదంలో మరణిస్తే పోస్టుమార్టం కూడా నిర్వహించకుండా చేసేందుకు ప్రయత్నించారన్నారు. ఈ విషయంలో ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని, పార్టీ శ్రేణులు కూడా చంద్రబాబు కళ్లు తెరిపించేలా అక్రమ కేసులపై జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో గురువారం నిరసన కార్యక్రమాలు చేయాలని కన్నబాబు పిలుపునిచ్చారు. ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాలు, మున్సిపల్‌ కేంద్రాలు, నగరపాలక సంస్థ కేంద్రాల వద్ద వెసులుబాటును బట్టి విభిన్న రీతుల్లో ప్రభుత్వ తీరుపై నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా చంద్రబాబు విధానాలను ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వార్తలు