సమస్యల పరిష్కారానికి డయల్‌ యువర్‌ కలెక్టర్‌

27 Jul, 2016 20:56 IST|Sakshi
సమస్యల పరిష్కారానికి డయల్‌ యువర్‌ కలెక్టర్‌
 
  • ఆగస్టు 1 నుంచి ప్రతి సోమవారం 

  • టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 425 2499 

 
నెల్లూరు(పొగతోట): జిల్లా కలెక్టర్‌ ఆర్‌ ముత్యాలరాజు ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఆగస్ట్‌ 1 నుంచి ప్రతి సోమవారం నిర్వహించనున్న డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం కోసం 1800 425 2499 టోల్‌ఫ్రీ నంబర్‌ను సిద్ధం చేశారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే డయల్‌ యువర్‌ ప్రోగ్రామ్‌కు ప్రజలు ఫోన్‌ చేయగానే కాల్‌సెంటర్‌లోని సిబ్బంది ముందుగా సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం ఫోన్‌ను కలెక్టర్‌కు లింక్‌ చేస్తారు. కలెక్టర్‌ స్వయంగా ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు. ఈ సంభాషణ మొత్తాన్ని రికార్డు చేయనున్నారు. అనంతరం  సమస్యలను శాఖల వారీగా విభజించి సంబంధిత జిల్లా అధికారులకు మెయిల్‌ ద్వారా పంపుతారు. ఫోన్‌లో తికమకగా సమాధానం చెప్పిన, సమస్యలను సక్రమంగా వివరించకపోయిన ఫోన్‌కట్‌ చేస్తారు. కలెక్టర్‌ గ్రీవెన్స్‌డేకు హాజరయ్యే అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తూ ఫోన్‌లో మాట్లాడతారు. భూ సమస్యలు, రేషన్‌కార్డులు, మంచినీరు, ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్యం, పాఠశాలల్లో మౌళిక వసతులు, తదితర సమస్యలను కలెక్టర్‌కు విన్నవించవచ్చు. జిల్లాలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం భూములు, నివేశన స్థలాల హద్దుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. మాజీ సైనికులు, నిరుపేదలకు కేటాయించిన భూములకు హద్దులు చూపకపోవడంతో సాగు చేసుకోలేకపోతున్నారు. చేతిలో పట్టాలు పెట్టుకుని భూములు చూపించండి అంటూ  రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. లబ్ధిదారులు భూములకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తే వెంటనే హద్దులు చూపేలా అధికారులు చర్యలు చేపడుతారు. చౌకదుకాణాల డీలర్లు రేషన్‌ సక్రమంగా ఇవ్వకపోయిన డయల్‌ యువర్‌ కార్యక్రమంలో ఫిర్యాదు చేయవచ్చు. నిరుపేదలు నగదు ఖర్చు పెట్టుకుని, సమయం వథా చేసుకుని కలెక్టర్‌ కార్యాలయానికి రాకుండా గ్రామం నుంచే కలెక్టర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.  
మరిన్ని వార్తలు