పాడితో పాల వెల్లువ

26 Sep, 2016 00:41 IST|Sakshi
బాలానగర్‌ : వరుసగా మూడేళ్లు కరువు ఏర్పడినా వారు చలించలేదు.. పాడి పరిశ్రమను చేపట్టి లాభాల బాటలో పయనిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రైవేట్‌ డైరీలకు దీటుగా ముందుకు అడుగులు వేస్తున్నారు. బాలానగర్‌ మండలంలోని తిర్మలాపూర్, కేతిరెడ్డిపల్లి, ఎక్వాయ్‌పల్లి, రాజాపూర్, ఈద్గాన్‌పల్లి, మల్లేపల్లి, రాయపల్లికి చెందిన మహిళలు పాడి పరిశ్రమను నమ్ముకున్నారు. 
 
ఆయా గ్రామ మహిళా సంఘాల ఆధ్వర్యంలో సుమారు 600మంది చిక్కటి పాలుపోసి చక్కటి ధరను పొందుతున్నారు. వాస్తవానికి 2006లో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ (బీఎంసీయూ) లకు అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పశుక్రాంతి, నాబార్డు, పాలప్రగతి కేంద్రాల మహిళా సంఘాలను ప్రోత్సహించారు. అప్పుడే ఈ మండలంలోని మహిళలకు పాడిగేదెలు, పాడి జెర్సీ ఆవులు ఇప్పించారు.
 
ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీని మహిళా సమాఖ్యలకు బీఎంసీయూలు అనుసంధానం చేసి 50శాతం సబ్సిడీపై పాడి ఆవులు, గేదెలను ఇప్పించారు. ఈ గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులు ఇంటికి రెండు, మూడు నుండి ఆరు వరకు జెర్సీ ఆవులను ఇటు మహారాష్ట్ర, అటు తమిళనాడు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి వాటి ద్వారా వచ్చే పాలను గ్రామ పాల సేకరణ కేంద్రాల ద్వారా జడ్చర్లలోని బీఎంసీయూకు సరఫరా చేస్తున్నారు. ఆవుపాలకు లీటరుకు రూ.27 నుంచి రూ.31 వరకు పాలలో ఫ్యాట్‌ను బట్టి డేదెపాలకు లీటరుకు రూ.30 నుంచి రూ.60 వరకు మహిళలు పొందుతున్నారు. ఇటు పశుపోషణతోపాటు వాటి ఎరువును కొందరు పండ్ల తోటలకు విక్రయిస్తున్నారు. ఇలా ఆయా గ్రామ మహిళలు లాభాలు గడిస్తున్నారు.
 
మరిన్ని వార్తలు