చేనేతలకు చేయూత కరువు.!

21 Aug, 2017 02:28 IST|Sakshi
చేనేతలకు చేయూత కరువు.!

జిల్లాలో 40 వేలకుపైగా చేనేత కార్మికులు
ముద్ర రుణాల పేరుతో అరకొరగా రుణం
బ్యాంకర్ల తీరుపై సర్వత్రా విమర్శలు


చేనేత కార్మికులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. జిల్లాలో చేనేత కార్మికుల కుటుంబాలు దాదాపు 40 వేల వరకు ఉన్నాయి. వారంతా చేనేత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. అయితే చేనేతలకు ప్రోత్సాహం అందించి ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. కార్మికుల అభివృద్ధిని ఆకాంక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం.. నేల చూపులు చూస్తోంది.

జమ్మలమడుగు/ జమ్మలమడుగు రూరల్‌ : జిల్లాలో వెయ్యి మంది చేనేతలకు ముద్ర రుణాలు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఒక్కో చేనేత కార్మికుడికి రూ. 50 వేల వరకు బ్యాంకర్లు రుణం ఇవ్వనున్నట్లు ఏడీ జయరామయ్య తెలిపారు. అయితే జిల్లాలో ఉన్న చేనేతల సంఖ్యకు.. అధికారులు మంజూరు చేస్తున్న రుణాల సంఖ్యకు వ్యత్యాసం భారీగా ఉండడంతో ప్రభుత్వ తీరుపై చేనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జమ్మలమడుగులోనే అత్యధికం..
జిల్లా వ్యాప్తంగా జమ్మలమడుగు, మోరగుడి, దొమ్మరనంద్యాల, వేపరాల, మైలవరం గ్రామాలతో పాటు పెద్దముడియం మండలంలో బీటీ పాడు, కొండాపురం మండలంలోని దత్తాపురం, ముద్దనూరు మండలంలోని ఉప్పలూరు, యామవరం, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాలల్లో చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు.

జమ్మలమడుగులో 300 మందికే రుణాలు..
జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వం ముద్ర పథకం కింద 300 మందికి మాత్రమే రుణాలు అందజేస్తామని అధికారులు తెలిపారు. ఒక్క జమ్మలమడుగు నియోజకవర్గంలోనే దాదాపు 10వేలకు పైగా చేనేత కుటుంబాలు నివాసం ఉన్నాయి. వీరిలో కేవలం 3 శాతం మందికి మాత్రమే రుణాలను మంజూరు చేయడంపై మిగిలిన వారు మండిపడుతున్నారు.

చేనేతలంటే అంత అలుసా..?
చేనేతలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు అవసరమైన రుణం మంజూరు కోసం బ్యాంకర్లు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని చేనేత కార్మిక సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. 2015–16 సంవత్సరంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం అందజేసిన క్రెడిట్‌ కార్డుల మేరకు.. ఒక్కో కార్మికునికి వ్యక్తిగతంగా రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు రుణం ఇవ్వాలి. అయితే బ్యాంకర్లు మాత్రం షూరిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రూ. 50 వేలకు రూ.30 వేలు మాత్రమే...
చేనేత కార్మికులకు బ్యాంకు అందజేసే రుణ మొత్తంలో రూ. 20 వేలను తమ వద్దే ఉంచుకోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రూ.50వేలు రుణం ఇవ్వాల్సి ఉండగా కార్మికుడికి రూ.30వేలను అందజేసి షూరిటీ పేరుతో రూ.20 వేలను బ్యాంకర్లు తమ వద్దే ఉంచుకుంటున్నారు. దీనికితోడు వీవర్స్‌ క్రెడిట్‌ కార్డు కలిగిన కార్మికులకు ఆరు శాతం మాత్రమే వడ్డీ వసూలు చేయాల్సి ఉంది. కానీ, బ్యాంకర్లు 12 శాతం వడ్డి విధిస్తూ..  తమ వద్ద ఉన్న రూ. 20 వేల షూరిటీ మొత్తానికి 8 శాతం వడ్డీ మాత్రమే ఇస్తుండడంపై విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులు కూడా బ్యాంకర్లకే వత్తాసుపలుకుతుండడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

బ్యాంకర్లు మోసం చేస్తున్నారు
కార్మికులకు రుణాలను పూర్తి స్థాయిలో ఇవ్వకుండా బ్యాంకర్లు వింత నిబంధనలు పెట్టి మోసం చేస్తున్నారు. బ్యాంకు అందజేసే రూ.30 వేలతో ఏవిధంగా చేనేతలు అభివృద్ధి చెందుతారో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. బ్యాంకర్లు అన్యాయంగా వ్యవహరిస్తున్నా.. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణం. – బడిగించల చంద్రమౌళి, చేనేత కార్మిక సభ్యుడు, జమ్మలమడుగు

రుణ మొత్తాన్ని అందజేయాలి..
చేనేత మగ్గాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం రూ.50 వేలకు పైగా ఖర్చవుతుంది. అలాంటిది బ్యాంకర్లు కేవలం రూ.30 వేలు మాత్రమే ఇస్తుండడంతో ఆ మొత్తాన్ని ఏ విధంగా అభివృద్ధికి వినియోగించుకోవాలో అర్థం కావడం లేదు. ఈ విధంగా అరకొరగా రుణాలు ఇచ్చినా... ఎవ్వరికీ ప్రయోజనం ఉండదు.  
– జొల్లు కొండయ్య, మోరగుడి

మరిన్ని వార్తలు