మంత్రికి ఆహ్వానమే లేదట

8 Apr, 2016 00:45 IST|Sakshi
మంత్రికి ఆహ్వానమే లేదట

 టీడీపీలో వర్గ వివక్ష
 మంత్రి పీతల సుజాతను
 పట్టించుకోని ఓ వర్గం నేతలు
 జగ్జీవన్‌రామ్ జయంతి నాడు
 బట్టబయలైన విభేదాలు

 
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారన్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మాటలనే ఆ పార్టీలోని ఓ వర్గం నేతలు స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. దళిత బాంధవుడు, మాజీ ఉపప్రధాని జగ్జీవన్‌రామ్ జయంతి రోజున ఆ పార్టీలోని వర్గ నేతల కుల వివక్షాపూరిత రాజకీయాలు బట్టబయలయ్యాయి. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఏకైక మంత్రి, దళిత వర్గానికి చెందిన పీతల సుజాతను ఏమాత్రం పట్టించుకోకుండా, కనీస ఆహ్వానం పంపించకుండా రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ ఈనెల 5న జిల్లాలో పర్యటించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది.
 
  ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గ పరిధిలో మంగళవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు ప్రత్తిపాటి, కామినేని పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్ 109వ జయంతి రోజునాడు దెందులూరు మండలం కొవ్వలిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, పెదవేగి మండలం లక్ష్మీపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డు భవనాలకు శంకుస్థాపన తదితర కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. ఆ ఇద్దరు మంత్రులతోపాటు స్థానిక ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మితోపాటు కలెక్టర్, ఆర్డీవో పాల్గొన్నారు. ఇంతమంది ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమాలకు జిల్లాకే చెందిన పీతల సుజాత గైర్హాజరుపై పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
 
 మంత్రి పీతల సుజాతకు ఆహ్వానమే లేదట
 ఆ కార్యక్రమాలకు సంబంధించి మంత్రి పీతల సుజాతకు ఎటువంటి ఆహ్వానాలూ అందలేదని తెలుస్తోంది. అందుకే మంగళవారం ఆమె జిల్లాలోనే ఉన్నప్పటికీ వేర్వేరుచోట్ల జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలకు మాత్రమే పరిమితమైన సుజాత ఆ ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు వెళ్లలేదని అంటున్నారు. ఆ రోజు దెందులూరు మీదుగానే ఆమె చింతలపూడి వెళ్లినా కనీస సమాచారం లేనందువల్లే ఆయా కార్యక్రమాలకు హాజరు కాలేదని తెలుస్తోంది.
 
  మంత్రి పీతల ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి.. దెందులూరుకు పొరుగునే ఉన్నప్పటికీ ఆమెను ఆహ్వానించకపోవడంపై పార్టీలోని దళిత వర్గాలు గుర్రుగా ఉన్నాయని సమాచారం. ఇక గోపాన్నపాలెంలో ఓ పీహెచ్‌సీ ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకంపై మంత్రి సుజాత పేరును అడుగున వేయించడం కూడా వివాదాస్పదమవుతోంది.
 
 పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అంతా మేమే అన్నట్టు హల్‌చల్ చేస్తున్న ఓ వర్గ నేతలు  ఉద్దేశపూర్వకంగానే దళిత సామాజిక వర్గానికి చెందిన పీతల సుజాతను అవమానిస్తున్నారన్న వాదనలు బయలుదేరాయి. జిల్లాలో ఇటీవల కాలంలో సాగుతున్న వివక్షాపూరిత వర్గ రాజకీయాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని పార్టీలోని దళిత నేతలు నిర్ణయించినట్టు సమాచారం.
 

మరిన్ని వార్తలు