స్మగ్లింగ్‌ గుట్టు.. విభేదాలతో రట్టు

25 Sep, 2016 23:41 IST|Sakshi
స్మగ్లింగ్‌ గుట్టు.. విభేదాలతో రట్టు
 
  • – పక్కా సమాచారంతో అధికారులకు ఫిర్యాదులు
  • – భారీ స్థాయిలో పట్టుబడుతున్న రేషన్‌ బియ్యం
  • – శాంతిభద్రతల సమస్యగా మారే పరిస్థితులు
  • – నివురుగప్పిన నిప్పులా స్పర్థలు  
 
స్మగర్ల మధ్య విభేదాలు రేషన్‌ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టు అవుతోంది. అధికారుల మధ్య సమన్వయలోపాన్ని..నిర్లక్ష్యాన్ని, పోలీస్, విజిలెన్స్‌ నిఘా కొరవడాన్ని ఆసరాగా చేసుకుని తమిళ, ఆంధ్ర రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి స్మగ్లర్లు రూ.కోట్లు గడించారు. తాజా పరిణామాలు ఇందుకు భిన్నంగా మారాయి. స్మగ్లర్ల మధ్య విభేదాల నేపథ్యంలో బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై ఏకంగా విజిలెన్స్, సివిల్‌ ఎస్పీలకు, కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్లకు ఫోన్‌చేసి ఉప్పందిస్తున్నారు. కింది స్థాయి అధికారులకు చెబితే వ్యవహారం మారిపోతుందని భావించి ప్రతీకారేచ్ఛలకు పాల్పడుతున్నారు. 
తడ :   
 జిల్లా, తమిళ రాష్ట్రం సరిహద్దు మండలాల్లో కొన్నేళ్లుగా రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ గుట్టుగా సాగుతుంది. రేషన్‌ స్మగ్లర్ల మధ్య తలెత్తిన విభేదాలు తారా స్థాయికి చేరుకోవడంతో బియ్యం అక్రమ రవాణా బట్టబయలవుతుంది. ఇప్పటికే ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ 9 లారీల బియ్యం వివిధ ప్రాంతాల్లో అధికారులకు పట్టించారు. స్థానిక అధికారులకు సమాచారం ఇస్తే వెంటనే స్మగ్లర్లకు సమాచారం చేరవేసి ఉత్తుత్తి దాడులతో సరిపుచ్చే అవకాశం ఉండటంతో నేరుగా ఎస్పీలు, కలెక్టర్లకు ఫోన్లు చేసి మరీ ఒకరి లారీలు మరొకరు పట్టించుకుంటున్నారు. వాహనాల నంబర్లు, ఎప్పుడు, ఎక్కడ వస్తున్నది, ఏఏ ఇంట్లో బియ్యం నిల్వలు ఉన్నాయి వంటి విషయాలన్ని పక్కాగా సమాచారం అందిస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పని సరి పరిస్థితుల్లో దాడులు చేసి పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది.  
గతంలోనూ..
 గతంలో ఇంతకంటే ఎక్కువ స్థాయిలో స్మగ్లింగ్‌ జరిగేది. అప్పట్లోనూ ఇదే తరహాలో స్మగ్లర్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుని పట్టించారు. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి దిగారు. ఈ క్రమంలో తమిళనాడు పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసులు నమోదు చేశారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకునేందుకు తమిళ పోలీసులు ప్రయత్నించిన సందర్భంలో స్మగ్లర్లు తమకు అనుకూలమైన వ్యక్తులతో తడ పోలీస్‌స్టేషన్‌ వద్దే తమిళ పోలీసులపై రాళ్లతో దాడులు చేసేందుకు కూడా వెనుకాడలేదు. దీంతో తమిళ పోలీసులు తీవ్రంగా పరిగణించి స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌ పెట్టేలా సమాయత్తం కావడంతో ఈ వ్యాపారులు కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం గత పరిస్థితులు ఉత్పన్నమవుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
వాటాలాపై స్పర్థలే కారణం
కొంత కాలం వెనుకడుగు వేసిన స్మగ్లర్లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు అవకాశం ఉన్న వ్యాపారాన్ని వదులుకునేందుకు ఇష్టపడక తిరిగి వ్యాపారాన్ని మొదలు పెట్టారు. గతంలో చక్రం తిప్పిన వారు కొద్ది మంది మాత్రమే ప్రస్తుత వ్యాపార ంలో ఉండగా కొత్త వారు అధిక మంది ఉన్నారు. వ్యాపారం పెరిగే కొద్దీ శత్రువులు పెరిగారు. కొందరు ఇందులో వాటాల కోసం కోరగా స్మగ్లర్లు నిరాకరించడంతో వివాదాలు మొదలయ్యాయి. 
స్మగ్లింగ్‌ ఇలా..
ఈ వ్యాపారంలో వాటంబేడుకు చెందిన వ్యక్తులు ఆరితేరిన స్మగ్లర్లుగా పేరు తెచ్చుకున్నారు. పడవల ద్వారా రేషన్‌డీలర్‌ నుంచి గోతాలు సైతం సీల్‌ తీయకుండా బియ్యం బస్తాలు వాటంబేడు, తడ, పూడి, ఖాశింగాడు కుప్పం తదితర రేవులకు చేరుస్తారు. తడ, పూడికుప్పం, సెల్వకుప్పం గ్రామాల్లో చిల్లరగా బియ్యం కొనుగోలు చేసి సేకరించిన బియ్యాన్ని నిల్వ చేస్తారు. రాత్రి సమయంలో లారీకి లోడింగ్‌ చేసి తరలిస్తూ ఉంటారు. తమిళనాడులో ఉచితంగా ఇచ్చే ఈ ఉప్పుడు బియ్యం అక్కడ సేకరించేవారు రూ.5 నుంచి రూ.7 వరకు కొనుగోలు చేస్తారు. అక్కడి నుంచి దళారుల వద్దకు రూ.10 నుంచి రూ.12లకు విక్రయిస్తున్నారు. దారి పొడవునా ఉన్న అడ్డంకులను డబ్బుతో తొలగించుకుంటూ స్మగ్లర్లు ఈ బియ్యాన్ని గమ్యస్థానం చేర్చడం ద్వారా కిలో రూ.24లకు విక్రయిస్తారు. ఎన్ని ఖర్చులు పోయినా ఒక్కో లోడుపై భారీగా ఆదాయం మిగులుతూ ఉండటంతో స్మగ్లర్లు ఈ వ్యాపారం ద్వారా లక్షాధికారులు అవుతున్నారు. సూళ్లూరుపేటలోని ఒకరిద్దరు బియ్యం వ్యాపారులు దళారులుగా రేషన్‌బియ్యం కొనుగోలు చేస్తూ కోట్లకు పడగలెత్తడం చూస్తే ఇందులో ఉన్న ఆదాయం ఎంతో ఇట్టే అర్థం అవుతుంది. 
మరిన్ని వార్తలు