కష్టాల్లో ఖరీఫ్

16 Jul, 2016 03:38 IST|Sakshi
కష్టాల్లో ఖరీఫ్

* రైతుల కష్టాలపై ప్రశ్నించనున్న విపక్షం
* గత సమీక్షలు ఆరు శాఖలకే పరిమితం
* ఈసారి అజెండాలో వ్యవసాయమే ప్రధానం
* నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

శ్రీకాకుళం టౌన్: జిల్లాలో ప్రజాసమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. నెలల తరబడి ఫైళ్లు పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. ఉన్నత స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు బదిలీలతో రెండు నెలలు గడిచిపోయింది. వెనకుటి తేదీలతో ఇప్పటికీ ఇంకా బదిలీలు చేస్తుండడంతో పాలన గాడితప్పింది. దీనికి తోడు మూడు నెలలకొక మారు చర్చించుకునే అవకాశం ఉన్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆరు అంశాలపైనే సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించి సమాధానాలు రాబట్టారు.

ఈసారి వ్యవసాయంపై చర్చ సాగే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ మొదలవడంతో జిల్లాలో గత నెలలో కురిసిన వర్షాలకు నారుమళ్లు సిద్ధమయ్యాయి. ఖరీఫ్ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. వర్షాలు మెరుగ్గా ఉండడంతో ఈ ఏడాది సాగుకు అనుకూలంగా ఉంటుందని రైతులు ఆశపడుతున్నారు. ఈనేపథ్యంలో రైతుల అవసరాలను తీర్చేబాధ్యతలను ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. జిల్లా పరిషత్ యాజమాన్యం పరిధిలో తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉన్నాయి. ఇప్పటికే జిల్లా స్థాయిలో ఖరీఫ్‌కు తగిన సహకారం అందించడానికి జెడ్పీలో చర్చ జరగాల్సి ఉన్నా ఇంతవరకు చేపట్టలేదు. శనివారం ఖరీఫ్ ముందస్తు సమీక్షకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వేదికవుతోంది.
 
వర్షాధారమే అధికం
జిల్లాలో ఏటా 4.17లక్షల హెక్టార్ల మేరకు సాగు విస్తీర్ణం అందుబాటులో ఉంది. ఇందులో నికర నీటి లభ్యత 1.82 లక్షల హెక్టార్లకు మాత్రమే ఉంది. వర్షాధారంతో కొన్ని ప్రాంతాల్లో సాగవుతోంది. ఇందులో వంశధార కుడి, ఎడమ కాలువలతోపాటు నాగావళినదిపై ఉన్న నారాయణపురం, తోటపల్లి కుడి ఎడమ కాల్వలతోపాటు మడ్డువలస రిజర్వాయర్, చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులైన పైడిగాం, కళింగదళ్, డబార్సింగి, లోకొత్తవలస, జంపరకోట, లొత్తూరు, జలాశయాలు, ప్రాజెక్టుల ఆయకట్టు కింద 2.05 లక్షల హెక్టార్ల భూమి సాగవుతోంది. ఇందులో ప్రధాన పంట వరి, చెరకు, మొక్కజొన్న, వేరుశెనగ, పత్తి, అపరాలసాగు వంటి పంటలు పండిస్తున్నారు. సాగుకు అవసరమైన నీటి నిల్వల సామర్థ్యం ఉన్న శాశ్వత ప్రాజెక్టులు అందుబాటులోకి రాకపోవడంతో రైతులకు ఏటా కరువుతప్పని పరిస్థితి.
 
శివారు ప్రాంతాలకు అందని సాగునీరు

ఈ ఏడాది తోటపల్లి ప్రాజెక్టు నీరు కొత్త ఆయక ట్టుకు సాగునీరు అందిస్తుందని రైతులు ఆశపడుతున్నారు. కాగా, గురువారం నీరు విడుదల చేసినప్పటికీ శివారు గ్రామాలకు ఇంకా నీరు చేరలేదు. వంశధార ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఏటా శివారు ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఖరీఫ్‌కు నీటిపారుదలశాఖ ముందస్తు చర్యలను తీసుకోవాల్సి ఉంది. జెడ్పీ పాలక మండలి సభ్యులు ఈ అంశాన్ని చర్చించేందుకు వీలుంది.
 
రైతులను వేధిస్తున్న విత్తనాల కొరత
ఖరీఫ్ రైతాంగానికి ఇప్పటికే విత్తనాల కొరత వేధిస్తోంది. రైతులు మార్కెట్ కమిటీలు, విత్తన కేంద్రాల వద్ద పడిగాపులు కాసినా విత్తనాలు లభ్యం కావడం లేదు. రైతులకు నాణ్యమైన విత్తనాలు మార్కెట్‌లో దొరకడం లేదు. నైర వ్యవసాయ పరిశోధనా కేంద్రంతోపాటు విత్తనాభివృద్ధి సంస్థ అందిస్తున్న విత్తనాలు సరిపోక రైతులు అవస్థలు పడుతున్నారు.

మరోవైపు ఖరీఫ్ సీజన్‌కు ముందే రైతులు ఎరువులను సిద్ధం చేసుకోవాల్సివస్తోంది. ఎప్పటికప్పుడే మార్కెట్‌లో ఎరువుల ధరలు పెంచడంతోపాటు కృత్రిమ కొరత సృష్టించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఏడాది జిల్లాకు సరిపడా ఎరువులను అందించడంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై చర్చించే అవకాశం ఉంది.
 
అందని రుణాలు
ఖరీఫ్ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ రుణ ప్రణాళికలను సిద్ధం చేసినా ఇంతవరకు రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వని పరిస్థితి నెలకొని ఉంది. మరో వైపు పంట రుణాల మాఫీ పత్రాలను ప్రభుత్వం ఇచ్చినా వాటిని ఎందుకు పనికి రాని కాగితాలుగా బ్యాంకర్లు కొట్టిపారేస్తున్నారు. స్వయానా మంత్రి అచ్చెన్నాయుడినే ఓ బ్యాంకు మేనేజరు తన సీట్లో ఉండి పనిచేయమంటూ హితవు పలికారంటే ఇక రుణాల మంజూరు ఎలా ఉంటుందో ఊహించకోవచ్చు. వీటితోపాటు మరెన్నో సమస్యలపై సభ్యులు చర్చించే అవకాశం ఉంది

మరిన్ని వార్తలు