పరువు హత్యలపై చట్టం చేయాలి

28 May, 2017 23:58 IST|Sakshi
పరువు హత్యలపై చట్టం చేయాలి
రాష్ట్ర ఐద్వా నేతల డిమాండ్‌
అమలాపురం రూరల్‌ (అమలాపురం) : రాష్ట్రంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న పరువు హత్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రత్యేక చట్టం చేయాలని ఐద్వా రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో పాల్గొన్న రాష్ట్ర మహిళా ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. మండలంలోని భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తోన్న ఈ తరగతుల్లో ఆదివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చోటు చేసుకున్న పరువు హత్య కేసులను జిల్లాల వారీగా చర్చించారు. ఈ ప్రధాన సమస్యతో పాటు మహిళా సమస్యలను నిరసిస్తూ భట్లపాలెంలో ఐద్వా మహిళలు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. పరువు హత్యలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లును ఆమోదించాలని కోరారు. ‘మహిళా సమస్యలు... పరిష్కార మార్గాలు’అంశంపై సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.స్వరూపరాణి ప్రసంగించారు. మహిళల సమస్యలు పోరాటాల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. స్త్రీ, పురుషులకు సమాన హక్కుల కోసం ఆస్తుల చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఐద్వా రాష్ట్ర నాయకురాలు నండూరి రూపావాణి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమయంలో మహిళలు కీలక పాత్ర పోషించారని... అలాంటి మహిళలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ సమాజంలో మూఢ నమ్మకాలు...మద్యం అనర్ధాలపై మహిళలకు అవగాహన కల్పించారు. మెజీషియన్‌ సీహెచ్‌ శ్రీరాములు, జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్‌ ఎ.కృష్ణశ్రీ, జిల్లా కార్యదర్శి వీఎస్‌ఎన్‌ రెడ్డి తదితరులు మహిళా చైతన్యం, విజ్ఞానం అంశాలపై వివిధ ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. శిక్షణ తరగతులు సోమవారం కూడా ఇదే వేదికపై కొనసాగుతాయని ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రమణి చెప్పారు. నాలుగో రోజు మంగళవారం ముగింపు కార్యక్రమాన్ని అంతర్వేదిలో నిర్వహిస్తామన్నారు. ఐద్వా నాయకురాళ్లు విజయమ్మ, మాధవి, అలివేలు, ఇందిర, సావిత్రి, తులసి, అరుణ, ఆదిలక్ష్మి, కుడుపూడి రాఘవమ్మ తరగతుల్లో ప్రసంగించారు. సీపీఐ డివిజన్‌ కార్యదర్శి మోర్త రాజశేఖర్, కార్మిక నాయకుడు పచ్చిమాల వసంతకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు