జిల్లాలో 75 పాఠశాలల్లో డిజిటల్‌ క్లాసులు

21 Dec, 2016 23:07 IST|Sakshi
జిల్లాలో 75 పాఠశాలల్లో డిజిటల్‌ క్లాసులు
– డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి
మహానంది: జిల్లాలో ఇప్పటి వరకు 75 పాఠశాలల్లో డిజిటల్‌ క్లాసులను ప్రారంభించామని జిల్లా విద్యాశాఖాధికారి కె.రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం బుధవారం ఆయన మహానందికి వచ్చారు. అనంతరం తిమ్మాపురంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్‌  ఫర్హానాబేగంను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఎంసెట్‌లో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రతి మోడల్‌ స్కూల్‌లో కొంత మంది విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 14 పీఈటీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీ మోడల్‌ స్కూల్‌ హాస్టళ్లను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలు మినహా మిగిలిన పాఠశాలల్లో  విద్యార్థులకు కూడా బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని త్వరలో మొదలు పెడతామన్నారు. జిల్లాలో సుమారు 200 మంది ఉపాధ్యాయుల కొరత ఉందని డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. 
మహానందిలో పూజలు
డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేపట్టారు. ఆలయ పండితులు రవిశంకర అవధాని, తదితరులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేశారు. ఆయన వెంట మహానంది, శిరివెళ్ల మండలాల ఎంఈఓలు రామసుబ్బయ్య, శంకరప్రసాద్ ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు