టెన్త్ తర్వాత కూడా చదువుకుంటాం..పెళ్లి చేసుకోం!

16 Nov, 2016 18:11 IST|Sakshi

సిద్దిపేట: పదో తరగతి పూర్తయిన వెంటనే పెళ్లిళ్లు చేసుకోబోమని, ఉన్నత చదువులు చదువుకుంటామని కస్తూరిభా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ప్రమాణం చేశారు. నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీ భూక్య మంగ, వ్యవసాయ చైర్మన్ లింగాల సాయన్న పాఠశాలలో బుధవారం ఉదయం డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంఈవో అర్జున్ మాట్లాడారు. పాఠశాల విద్యార్థినులు తమకు ఒక హామీ ఇవ్వాలని కోరారు. పేద కుటుంబాల వారు తమ బిడ్డలు మంచి చదువులు చదివి ప్రయోజకులు కావాలని కలలు కంటున్నారని అన్నారు.

అయితే, ఎక్కువ మంది పదో తరగతి పూర్తి కాగానే పెళ్ళిళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాకుండా, ఉన్నత చదువులు చదివిన తర్వాతే వివాహం చేసుకొనేలా తమకు మాట ఇవ్వాలని కోరారు. దీంతో విద్యార్ధినులంతా ఒక్కసారిగా తాము టెన్త్ అయిపోగానే ఎట్టి పరిస్ధితుల్లో వివాహం చేసుకోమని, ఉన్నత చదువులు పూర్తి చేసే వరకూ పెళ్ళి మాట ఎత్తమని, మాటే కాదు ప్రమాణం చేసి చెబుతున్నామని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

మరిన్ని వార్తలు