పరువు హత్య కారకుల అరెస్ట్‌

7 Jun, 2017 23:16 IST|Sakshi
పరువు హత్య కారకుల అరెస్ట్‌
అమలాపురం సబ్‌జైలుకు తరలింపు
రాజోలు : సంచలనం రేకెత్తించిన పరువు హత్యకు కారకులైన ఇద్దరు వ్యక్తలను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. కూతురిని ప్రేమిస్తున్నాడనే కక్షతో మలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన కానుబోయిన రామాంజనేయులు (23)ను గొల్లపాలేనికి చెందిన కందుల విజయ్‌కుమార్, మట్టా నాగబాబు పథకం ప్రకారం హత్య చేశారని రాజోలు సీఐ క్రిస్టోఫర్‌ తెలిపారు. ఈ కేసు వివరాలను ఆయన ఇలా తెలియజేశారు. విజయ్‌కుమార్‌ కూతురిని ప్రేమించాలని తరచూ రామాంజనేయులు వేధించేవాడని, పలుసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో రామాంజనేయులను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడు మట్టా నాగబాబు ద్వారా రామాంజనేయులును గత నెల 2న గొల్లపాలెంలోని బీచ్‌ వద్దకు పార్టీ పేరుతో అమ్మాయి తండ్రి పిలిపించాడు. బీచ్‌ వద్ద ముగ్గురు మద్యం సేవించారు. అక్కడ కూతురిని ప్రేమించడం మానుకోవాలని అతడికి చెప్పాడు. నిరాకరించిన అతడిని చెంప మీద కొట్టాడు. కుప్పకూలిన రామాంజనేయులును నైలాన్‌ తాడుతో మెడకు బిగించి హతమార్చాడు. ఇందుకు విజయ్‌కుమార్‌ స్నేహితుడు నాగబాబు సహకరించాడు. అతడి మృతదేహాన్ని వారిద్దరూ సముద్రం ఒడ్డున పూడ్చేశారు. కుమారుడు కనిపించకపోవడంతో రామాంజనేయులు తండ్రి నూకాలరావు మలికిపురం పోలీసులు గత నెల 4న ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసుగా నమోదు చేసి మలికిపురం ఎస్సై విజయ్‌కుమార్‌ దర్యాప్తు చేపట్టారు. పోలీసులు విజయ్‌కుమార్‌ గురించి గ్రామంలో ఆరా తీశారు. అతని స్నేహితుడు నాగబాబు కూడా రామాంజనేయులు అదృశ్యం తరువాత నుంచి కనిపించడం లేదని గుర్తించారు. గ్రామస్తులు, బంధువుల సమాచారం మేరకు వారి కోసం పోలీసులు ముంబాయి వెళ్లారు. అయితే వారు కడప జిల్లా జమ్మలమడుగు, రాజంపేట, హైదరాబాద్‌ ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు సీఐ తెలిపారు. విషయం తెలుసుకున్న వారిద్దరూ రాజోలు చేరుకున్నారు. అక్కడి నుంచి గూడపల్లి వెళ్లేందుకు రాజోలు బస్టాండ్‌ వద్ద ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటారాగేషన్‌లో హత్య చేసినట్టు అంగీకరించారు. నిందితులను ఇరువురుని రాజోలు కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్‌ విధించడంతో వారిని అమలాపురం సబ్‌జైలుకు తరలించారు. 
మరిన్ని వార్తలు