కాపు కులాన్ని చీల్చే కుట్రలో చంద్రబాబు

2 Nov, 2016 07:13 IST|Sakshi
కాపు కులాన్ని చీల్చే కుట్రలో చంద్రబాబు

- ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మండిపాటు
- విజయవాడలో కాపుల ఆత్మీయ సమావేశం
- వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బాబు దోపిడీ
- వైఎస్ జగన్ పాదయాత్రను స్వాగతిస్తున్నానని వెల్లడి
 
 సాక్షి, అమరావతి/విజయవాడ సెంట్రల్/రేణిగుంట: కాపు కులాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చీల్చే ప్రయత్నం చేస్తున్నారని, కాపు కులానికి చెందిన వారంతా మేల్కోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో మంగళవారం జరిగిన కాపు ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కష్టపడ్డారని, అయితే పవర్ మాత్రం చంద్రబాబు అనుభవిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో పవన్‌ను వాడుకొని తర్వాత వదిలేశారన్నారు. కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వాళ్లపైనే అక్రమ కేసులు బనాయించడం మంచిదికాదన్నారు. టీడీపీలోని కాపు నేతలు చంద్రబాబు మాయ నుంచి ఇప్పటికైనా బయటకు రావాలన్నారు.

కాపులకు రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. కాపులను బీసీలో చేర్చే విషయమై కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో నడుస్తున్న ఉద్యమానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. శాసనమండలి ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్లకు సంబంధించి సీఎం చెప్పిందే రిపోర్టు అవుతోందని ఎద్దేవా చేశారు. పుట్టుస్వామి కమిషన్‌ను గతంలో తొక్కిపెట్టిన చంద్రబాబు ఇప్పుడు మంజునాథ కమిషన్‌ను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. కర్నూలు, కడప, తిరుపతి ప్రాంతాల్లో కమిషన్ పర్యటన సందర్భంగా బాబు బీసీ నాయకుల్ని ఎగతోలి అల్లర్లు చేయించారన్నారు. బాబు అధికారంలో ఉండగా కాపులకు రిజర్వేషన్లు వచ్చే అవకాశం లేదన్నారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేవీపీ, పళ్లంరాజు, కనుమూరి బాపిరాజు, కాపు నేత లింగంశెట్టి ఈశ్వరరావు, ఎన్.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

 ‘బాబు’ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
 రానున్న ఎన్నికల్లో విచ్చల విడిగా ఖర్చు చేసి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు. ఆంధ్రరత్న భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి రూ.10 కోట్ల చొప్పున ఇస్తానని చంద్రబాబు బహిరంగంగా ప్రకటిస్తున్నారని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎక్కడా చూడలేదన్నారు. రాజధాని నిర్మాణం స్విస్ చాలెంజ్ పద్ధతిలో సింగపూర్‌తో ఒప్పందం కుదుర్చుకొని కోట్లాది రూపాయలు వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2004 ఎన్నికల్లో కూడా చంద్రబాబు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసినా వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాయకత్వ పటిమతో చంద్రబాబును ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.

భోపాల్ సెంట్రల్ జైల్ నుంచి పారిపోయిన 8 మంది సిమి ఉగ్రవాదుల కాల్చివేత ఘటనపై ఎన్‌ఐఏ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం పీసీసీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన యూనిఫార్మ్ సివిల్ కోడ్ ప్రతిపాదన వ్యతిరేక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఇలా ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న పాదయాత్రను స్వాగతిస్తున్నానని దిగ్విజయ్‌సింగ్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన గన్నవరం నుంచి స్పైస్‌జెట్ విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలో పయనించి పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సవుస్యలను తెలుసుకుని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కోరారు.

మరిన్ని వార్తలు