రేషన్‌ బియ్యం.. అయోమాయం

26 Apr, 2017 23:50 IST|Sakshi

 ‘రేషన్‌ బియ్యం తీసుకోవడం మానేయండి.. కిలోకు రూ.20 చొప్పున నేరుగా నగదు తీసుకోండి’ ఇకపై ప్రభుత్వం చేయబోయే ప్రచారమిది. ఆహార భద్రత పథకం కింద పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని వారికి దూరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రేషన్‌ బియ్యం పంపిణీపై ఇప్పటికే సర్వే నిర్వహించామని.. చాలామంది ఈ బియ్యాన్ని తీసుకోకుండా డీలర్లకు అమ్మేస్తున్నారని చెబుతోంది. ఈ ముసుగులో బియ్యం పంపిణీని నిలిపివేసే దిశగా అడుగులు పడుతున్నాయి. బియ్యానికి బదులు నగదు ఇచ్చే విధానాన్ని తొలుత మన జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

భీమవరం/పాలకోడేరు :
జిల్లాలో అనేక నిరుపేద కుటుంబాలు రేషన్‌ బియ్యం అందుతుండటం వల్లే గుప్పెడు మెతుకులు తినగలుగుతున్నాయి. మనిషికి 5 కేజీల చొప్పున ఇస్తుండగా.. అవి 15 నుంచి 20 రోజులు మాత్రమే సరిపోతున్నాయి. మిగిలిన రోజుల్లో కడుపు నింపుకునేందుకు స్థోమత గలవారు బహిరంగ మార్కెట్‌లో కిలోకు రూ.40 చొప్పున 
వెచ్చించి బియ్యం కొనుగోలు చేస్తుంటే.. నిరుపేదలు పస్తులు ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేషన్‌ బియ్యం తీసుకోవడం మానేస్తే కిలోకు రూ.20 చొప్పున ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేయడం పేదల పొట్టకొట్టడమే అవుతుందని ప్రజాసంఘాలు పేర్కొంటున్నాయి. ఆహార భద్రత పథకానికి తూట్లు పొడిచే విధానాలను మానుకోవాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. మనిషికి ఇచ్చే 5 కిలోల బియ్యం స్థానంలో కిలోకు రూ.20 చొప్పున రూ.100 మాత్రం ఇస్తారని.. ఆ సొమ్ముతో పేదలు ఏం తినగలరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 
 
ప్రభుత్వం ఏం చెబుతోందంటే..
జిల్లాలోని తెల్ల రేషన్‌ కార్డుదారులకు ప్రతినెలా 17 వేల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. కిలో బియ్యాన్ని ప్రభుత్వం రూ.27కు కొనుగోలు చేస్తోంది. రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి కిలో బియ్యం సుమారు రూ.35 అవుతోంది. జిల్లాలోని కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు రూ.59.50 కోట్లు వెచ్చిస్తున్నాయి.  కిలో బియ్యాన్ని రూపాయికే కార్డుదారులకు విక్రయించడం వల్ల ప్రభుత్వానికి రూ.1.70 కోట్లు మాత్రమే ఆదాయం వస్తోంది. అంటే ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.57.80 కోట్ల భారం పడుతోంది. ఇంత సొమ్ము వెచ్చించినా ఆ బియ్యాన్ని వినియోగిస్తున్న వారు తక్కువగా ఉన్నారనేది ప్రభుత్వ వాదన. ఈ విషయం సర్వేలో వెల్లడైందని చెబుతోంది. చాలామంది కార్డుదారులు బియ్యాన్ని రేషన్‌ డీలర్లకు అమ్మేసుకుంటున్నారని.. ఈ కారణంగానే బియ్యానికి బదులు నగదు ఇవ్వాలనే ఆలోచన ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానాన్ని మన జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి కలెక్టర్‌ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. బియ్యం బదులు నగదు కావాలనుకునే వారి ఖాతాల్లో కిలోకు రూ.20 చొప్పున జమ చేయాలని భావిస్తున్నారు. బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు కనుక కిలోకు రూ.20 చొప్పున కార్డుదారులకు ఇస్తే నగదు రూపంలో రూ.7తోపాటు రవాణా చార్జీలు మిగులుతాయి. తద్వారా నెలకు రూ.25.50 కోట్ల వరకూ ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి 5 నుంచి 10 శాతం మంది మాత్రమే బియ్యాన్ని తీసుకోవడం లేదు. వారిలో కొందరు ఆ బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. రేషన్‌ బియ్యం తినడానికి అనువుగా లేకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం తినేందుకు అనువుగా ఉంటే ఎవరూ అమ్ముకునే పరిస్థితి ఉండదని.. మంచి బియ్యాన్ని సరఫరా చేయడం మానేసి ప్రభుత్వం దొడ్డిదారులు వెతకడం ఏమిటనే వాదన వినిపిస్తోంది. 
 

మరిన్ని వార్తలు