ప్రతి సినిమా వైవిధ్యభరితమే..

27 Feb, 2017 22:26 IST|Sakshi
ప్రతి సినిమా వైవిధ్యభరితమే..
సినీ దర్శకుడు చంద్రమహేష్‌
రావులపాలెం(కొత్తపేట) : ప్రేయసి రావే సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించిన చంద్రమహేష్‌ ఇంత వరకూ తాను చేసిన ప్రతి సినిమా వైవిధ్యభరితమైనవేనని అంటున్నారు. తన స్నేహితులు పడాల రామిరెడ్డి, సబెళ్ల సత్యనారాయణరెడ్డి(సన్ని)లను కలిసేందుకు సోమవారం నిర్మాత సామా సురేంద్రరెడ్డితో కలసి రావులపాలెం వచ్చిన ఆయన కాసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. మాది కాకినాడ. సినిమాలపై ఇష్టంతో సురేష్‌ ప్రొడక‌్షన్స్‌లో చేరాను. కె.మురళీమోహనరావు, సురేష్‌కృష్ణ, జయంతి సీ పరాన్జీ, సురేష్‌ వర్మ, బోయిన సుబ్బారావు, జంధ్యాల వంటి దర్శకుల వద్ద అసిస్టెంటుగా పనిచేశా. 1999లో ప్రేయసి రావే చిత్రంతో దర్శకుడిగా మారా. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు ఉత్తమ కొత్త దర్శకుడిగా నంది అవార్డు లభించడంతోపాటు చిరంజీవి, కె.విశ్వనాథ్‌ వంటి పెద్దల ప్రసంశలు లభించాయి. అలాగే అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం విషం, లవ్‌ ఇన్‌ హైదరాబాద్‌ చిత్రాలకు దర్శకత్వం వహించా. ఇప్పటి దాకా తెలుగులో తొమ్మిది సినిమాలు చేశా. హనుమంతు సినిమాకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నా. రెడ్‌ అలర్ట్‌ అనే సినిమాను తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో ఒకే సారి విడుదల చేయాలని నిర్మించాం. అయితే తెలుగు, కన్నడలో రెడ్‌ అలర్ట్, మళయాళంలో హై అలర్ట్, తమిళంలో చెన్నై నగరంగా విడుదల చేయాలని అనుకున్నా, నిర్మాత మృతితో ఒకే సారి చేయలేకపోయాం. తమిళంలో ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రానికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం లభించింది. ఒక ప్రేమకథను సిద్ధం చేసి ఒక యువ హీరోకి చెప్పాను. ఆయనకు నచ్చడంతో త్వరలో ఈ సినిమా తెలుగులో చేయనున్నాం.’’ 
మరిన్ని వార్తలు