దళిత క్రైస్తవులపై వివక్ష

19 Dec, 2016 23:58 IST|Sakshi
దళిత క్రైస్తవులపై వివక్ష
– వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్‌.మద్దయ్య  
కర్నూలు (ఓల్డ్‌సిటీ): దళిత క్రైస్తవులపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్‌.మద్దయ్య ఆరోపించారు. సోమవారం స్థానిక కృష్ణకాంత్‌ ప్లాజాలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన దళిత నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పక్క రాష్ట్రంలో ప్రభుత్వం క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తుంటే, ఏపీ ప్రభుత్వం నిమ్మకుండిపోవడం విచారకరమన్నారు
 
          ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నో హామీలిచ్చి నెరవేర్చలేదన్నారు. ఉద్యోగాలిస్తానని ఉన్న ఉద్యోగులను తొలగించారని, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్‌లో ఏడాది కాలమైనా దళితులకు రుణాలు లభించడం లేదన్నారు.  ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. అనేక మంది దళిత విద్యార్థులు ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు నోచుకోవడంలేదని, రోగులు ఆరోగ్యశ్రీ పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులు క్రిస్మస్‌ పండుగ జరుపుకునేందుకు వీలుగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లను ఈనెల 24వ తేదీలోపు చెల్లించాలన్నారు. వృద్ధులు, వికలాంగులకు బ్యాంకుల వద్ద నిలిచే శక్తి ఉండదని, వారికి ఇళ్లవద్దే పింఛన్‌ చెల్లించే ఏర్పాటు చేయాలన్నారు. దళిత క్రైస్తవులందరికీ వెంటనే దుస్తులు పంపిణీ చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో పార్టీ మైనారిటీసెల్‌ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్‌,  క్రిస్టియన్‌ మైనారిటీసెల్‌ ప్రతినిధి జాన్, దళిత క్రైస్తవ నాయకులు అశోక్‌బాబు, బుచ్చన్న, జీవరత్నం, జోహరాపురం మాధవస్వామి, భాస్కర్, తాండ్రపాడు ప్రభుదాస్‌ తదితరులు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు