విద్యా వ్యాపారంపై శాసనమండలిలో చర్చిస్తా

14 May, 2017 23:34 IST|Sakshi
విద్యా వ్యాపారంపై శాసనమండలిలో చర్చిస్తా

అనంతపురం రూరల్‌ : కార్పొరేట్‌ విద్యా సంస్థలు కొనసాగిస్తున్న విద్యా వ్యాపారంపై శాసన మండలిలో చర్చించి, ఫీజు నియంత్రణ చట్టం అమలు కోసం కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎన్‌జీఓ హోంలో  ఆదివారం ఐక్యవిద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పరశురాం అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ వరుస కరువులతో రైతులు ఉపాధి కోసం వలస  పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ విద్య సంస్థలు  విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కి లక్షలాది రూపాయాలు డొనేషన్ల పేరిట వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమిళనాడు తరహాలో 1వ తరగతి నుంచి 10 వరకు   ప్రభుత్వ సెక్టార్‌లోనే విద్యాభ్యాసం అందించేలా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఇక్కడి నుంచే ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పిలుపు నిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ మాట్లాడుతూ రేషనలైజేషన్‌ పేరిట ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 996 పాఠశాలలతోపాటు 56 వసతి గృహాలను మూసివేసిందన్నారు.  కార్పొరేట్‌ పాఠశాలలో విద్యాహక్కు చట్టం ఎక్కడ అమలు చేయడం లేదన్నారు. అయినా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్య వ్యాపారం సాగిస్తున్న పాఠశాలలపై ఐక్య ఉద్యమం చేపట్టాలన్నారు.

జిల్లాలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి 50 శాతం ఫీజులో రాయితీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతి పాఠశాల వద్ద తరగతుల వారీగా ఫీజుల వివరాలతో కూడిన నోటీస్‌ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి నాగరాజు మాట్లాడుతూ  ఫీజు నియంత్రణ కోసం  కలెక్టర్‌ ప్రత్యేక చోరవ చూపాలన్నారు.  ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు సాకే నరేష్, మల్లికార్జున నాయక్, ఆంజనేయులు, జనార్థనరెడ్డి, రాచానపల్లి గోపి, తోపాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు