వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

9 Sep, 2016 00:20 IST|Sakshi
మాట్లాడుతున్న కొండల్‌రావు
  • డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు
  •  
    ఖమ్మం వైద్య విభాగం : సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఏ.కొండల్‌రావు సూచించారు. నగరంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లతో గురువారం రివ్యూ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, పరిసరాల పరిశుభ్రత పాటించి జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతీ గ్రామంలో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి.. ఫ్రైడేను డ్రైడేగా విజయవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఇంట్లో నిల్వ ఉన్న నీటిని తొలగించేట్లు చేసి, వాటిలో పెరిగే లార్వాను నిర్మూలించేలా చేయాలని కోరారు. దీనికి యువత, నాయకులు తమ సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే పంచాయతీ సిబ్బంది మురికి కాల్వల్లో కిరోసిన్‌ పైరిత్రిన్‌ చల్లినట్లైతే లార్వాను నిర్మూలించే అవకాశం ఉంటుందని సూచించారు. ముఖ్యంగా ప్రజలు వారి ఇళ్లలోని కూలర్లు, టైర్లు, పెంకుల్లో నిల్వ ఉండే నీటిని తొలగించి.. డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలన్నారు. ఎస్‌పీహెచ్‌ఓ మాలతి మాట్లాడుతూ ఫ్రైడేను డ్రైడేగా పాటించి వ్యాధుల నుంచి రక్షణ పొందే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీఎంఓ రాంబాబు, డాక్టర్‌ మాధవరావు, డెమో వెంకన్న, డీహెచ్‌ఈ జి.సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు