వ్యాధుల ముసురు

28 Jul, 2016 01:29 IST|Sakshi
వ్యాధుల ముసురు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంతోసహా జిల్లా అంతా మంచం పట్టింది. వర్షాలు కురుస్తుండటం, ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడం, పారిశుధ్యలోపం, దోమల వ్యాప్తి కారణంగా వైరల్‌(విష) జ్వరాలు, ఇతర వ్యాధులు ఉధతమవుతున్నాయి. రోజురోజుకూ జ్వరాలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య అధికమవుతోంది. పల్లె, పట్టణమన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరం స్వైర విహారం చేస్తోంది. ఆస్పత్రులకు వివిధ జబ్బులు, వ్యాధులతో వచ్చే వారిలో 30 శాతం రోగులు జ్వరపీడితులే ఉంటున్నారు. వీటిలో వైరల్‌  జ్వరాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఫీవర్‌ సోకిన వ్యక్తులు బాగా నీరసపడిపోయి, నిస్సత్తువకు లోనవుతున్నారు. జ్వరంతో పాటు జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు తీవ్రంగా ఉంటున్నాయి. ఆస్పత్రులకు వెళ్లినా కనీసం మూడు రోజుల వరకూ  ఉపశమనం లభించడం లేదు. వైరల్‌ ఫీవర్లతో పాటు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ తదితర జ్వరాలూ జనాన్ని వణికిస్తున్నాయి. ఇప్పటికే మన్యంలో మలేరియా, మైదానంలో డెంగ్యూ జ్వరాలతో పలువురు మత్యువాత పడుతున్నారు. నగరంలోనూ, పట్టణాల్లోనూ ఉంటున్న జ్వరపీడితులు ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కానీ ఏజెన్సీ, జిల్లాలోని మారుమూల పల్లెల్లోనూ జ్వరాల బారిన పడ్డ వారు మాత్రం తగిన వైద్యం అందుకోలేకపోతున్నారు. కొంతమంది సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. నర్సీపట్నం, అనకాపల్లి వంటి పట్టణాల్లోని పేదలు అందుబాటులో ఉన్న ఏరియా ఆస్పత్రులకు వెళ్తున్నారు. 
 
ఆరు నెలల్లో 4 లక్షల రోగులు
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం 3,90,791 మంది జ్వరాల బారినపడ్డారు. అలాగే 3,770 మందికి మలేరియా, 150 మందికి డెంగ్యూ, 47 మందికి చికున్‌ గున్యా సోకినట్టు లెక్కకట్టారు. ఏజెన్సీ ఏరియాలో 2,687 మందికి, విశాఖ అర్బన్‌లో 744 మందికి, రూరల్‌లో 396 మందికి మలేరియా సోకినట్టు నిర్ధారించారు. ఈ అధికారిక లెక్కలకంటే రెట్టింపు జ్వర బాధితులుంటారు. ఇప్పటికీ మన్యంలో ప్రస్తుతం ఇంటికొకరు చొప్పున వివిధ రకాల జ్వరాలతో బాధపడుతున్న వారున్నారు. వీరిలో అత్యధికులు మలేరియా జ్వరాల వారే కనిపిస్తున్నారు. అయితే గత ఏడాదికంటే మలేరియా జ్వరాల తీవ్రత తగ్గిందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఏజెన్సీ ప్రాంతాలపై ప్రభుత్వం శ్రద్ధ తగ్గించే ప్రమాదం ఉందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మలేరియా, డెంగ్యూ, డయేరియాలతో అటు ఏజెన్సీలోనూ, ఇటు మైదానంలోనూ మరణాలు సంభవిస్తున్నా.. ఒక్కరూ మరణించినట్టు తమ రికార్డుల్లో నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ అధికారులు అంటున్నారు. 
 
సరికొత్తగా చికెన్‌పాక్స్‌
ఒకపక్క విష జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, డెంగూ జ్వరాలు జనాన్ని వణికిస్తుంటే.. అవి చాలవన్నట్టు సరికొత్తగా చికెన్‌పాక్స్‌ కూడా విజంభిస్తోంది. కాలం కాని కాలంలో చికెన్‌పాక్స్‌ కేసులు నమోదు కావడం వైద్యులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే చికెన్‌పాక్స్‌ ప్రభావం చూపుతుంది. దానికి భిన్నంగా ఇప్పుడు జూలైలో కనిపించడం అరుదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరల్‌ జ్వరాల ఉధతి ఉన్నందున వైరస్‌ ద్వారా వ్యాప్తి చెందే చికెన్‌పాక్స్‌ కూడా ఇప్పుడు సోకడానికి కారణం కావచ్చని కేజీహెచ్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ పీఎస్‌ఎస్‌ శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. 
 
ముందస్తు వర్షాల వల్లే..
ఈ ఏడాది ముందస్తుగా కురుస్తున్న వర్షాలే వైరల్‌ జ్వరాలు ప్రబలడానికి కారణమవుతున్నాయి. ప్రస్తుతం జ్వరాల ప్రభావం ఉండడం వాస్తవమే. జ్వరాల తీవ్రత ఎక్కువగా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్‌సీల్లో మందులు. వైద్యులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాం. 
– జి.సరోజిని, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి
 
మరిన్ని వార్తలు