నిర్వాసితులతో పరిహాసం

6 Jul, 2017 02:19 IST|Sakshi
నిర్వాసితులతో పరిహాసం

పునరావాసం కింద అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు
ఒక్కోఇంటి నిర్మాణానికి రూ.2 లక్షల వ్యయం
మొత్తం నిర్వాసిత కుటుంబాలు 29,545
పాఠశాలల్లో మరుగుదొడ్లకు రూ.1.85 నుంచి రూ. 7.5 లక్షల వ్యయం
నిర్వాసితులకు నిర్మించే ఇళ్ల విలువ రూ.2 లక్షలే
సర్కారు చిన్నచూపుపై విమర్శలు


వేలేరుపాడు : సొంత గూడు చెదిరిపోతున్న పోలవరం నిర్వాసితులను కష్టాల పీడ కలలా వెంటాడుతూనే ఉంది. అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం నిర్వాసితులను చిన్నచూపు చూస్తోంది. ఇక్కడ ఎవరూ  అడిగే వారు లేరనే ధోరణిలో వ్యవహరిస్తోంది. మెజార్టీ గిరిజనులు నిరుపేదలు, నిరక్ష్యరాస్యులు కావడంతో వారి బలహీనతలను ఆసరాగా తీసుకొని, నామమాత్రపు పరిహారాలతో చేతులు దులుపుకుంటోంది. తమకు అన్యాయం జరుగుతోందని ఒక వైపు నిర్వాసితులు అనేక సందర్భాల్లో  గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాధులే కరువయ్యారు. ఇన్నాళ్ళు తమకు ఏదో రకంగా న్యాయం జరుగుతుందని ఈ ప్రాంత నిర్వాసితులు కొండంత విశ్వాసంతో ఉన్నారు. తమకిచ్చే రెండు లక్షల విలువ చేసే ఇళ్లు చూసి, తాము నివశించబోయే ఇల్లు మరుగుదొడ్డి విలువ కూడా చేయదా అని  కుమిలిపోతున్నారు.

గ్రామాల్లో విశాలమైన ఇండ్లల్లో  ప్రశాంతంగా బతికే నిర్వాసితులు ఆ కాస్త మనశ్శాంతి కూడా కోల్పోయో పరిస్ధితులు నెట్టుకొస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29,545 కుటుంబాలు నిర్వాసితులు కానున్నాయి. ఇందులో పదివేల గిరిజన కుటుంబాలుండగా, 19,545 గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలున్నాయి. ఈ రెండు మండలాల్లో నిర్వాసితులు సర్వస్వం కోల్పోయి, ఆకస్మిక అగ్ని బాధితుల్లా కట్టుబట్టలతో బయటికొచ్చే పరిస్థితి. ముంపు మండలాల వాసులు తాము ఇక ముందు రెండులక్షల వ్యయంతో నిర్మించే ఇరుకిరుకు బందీ ఖానాల్లో ముడుచుకు పడుకోవాల్సివస్తుందనే దుస్దితి జీర్ణించుకోలేకపోతున్నారు. ముంపు మండలాల్లో ఏ గ్రామంలో చూసినా, పేద, గొప్ప అన్న తేడాలేకుండా ప్రతి ఇల్లు కనీసం పదిసెంట్ల జాగాలో కొలువుదీరి ఉంటుంది. అయితే పోలవరం ప్రాజెక్ట్‌  పుణ్యమా అని ఇదంతా ఒక కలలా, ఒక గతంలా మారిపోబోతోంది.

ఇంత విశాలంగా జీవించిన  ప్రజల్ని  ప్రభుత్వం గిరిజనులకు ఐదు, గిరిజనేతరులు మూడు సెంట్ల జాగాల్లో మగ్గిపోవాలని నిర్దేశిస్తోంది. మరుగుదొడ్లకు అయ్యే ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో  ఇళ్లు కట్టి æఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ళు కోల్పోయే నిర్వాసితులకు కేవలం రెండు లక్షల వ్యయంతో ప్రధానమంత్రి ఆవాస్‌యోజన పధకం కింద 22 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో చిన్న కాలనీలా ఇళ్లు నిర్మిస్తోంది. విచిత్రమేమిటంటే ప్రాధమికోన్నత, జిల్లా పరిషత్‌  పాఠశాలల్లో 18 అడుగుల 6అంగుళాల పొడవు, 8 అడుగుల 5అంగుళాల వెడల్పుతో నిర్మించే మరుగుదొడ్లకు మాత్రం లక్షా 85 వేల రూపాయల నుంచి ఏడున్నర లక్షల వరకు వెచ్చిస్తోంది. నిర్వాసితుల విషయాని కొస్తే,  రెండు లక్షలు కేటాయించడం ప్రభుత్వ చిన్న చూపునకు నిదర్శనంగా నిలుస్తోంది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు అక్కడి ముఖ్యమంత్రి 5లక్షల 4వేలతో నిర్మించే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కానుకగా ఇస్తున్నారు. 560 స్కేర్‌ ఫీట్‌ (చదరపు అడుగులు)లలో స్లాబ్‌ ఏరియా ఉన్న భవనం నిర్మించి, ఆ ఇంటికి మంచినీరు, రహదారి సౌకర్యం కల్పించుకోవడానికి మరో లక్షా25వేలు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముంపు  ప్రాంతంలో  నిర్వాసితుడికి అన్యాయం చేస్తోంది. ఈ నిర్ణయంతో ఈ ప్రాంత నిర్వాసితుల్లో  తీవ్ర అసంతృప్తి నెలకొంది.

పోలవరంలో 3లక్షల 15 వేలు... ఇక్కడ రెండు లక్షలే..
అంతా ఒకే ముంపు ప్రాంతమైనప్పటికీ ప్రభుత్వం వివక్ష చూపుతోంది. పోలవరం మండలంలో దేవరగొంది, తోటగొంది, రామన్నపేట, చేగుండపల్లి, పైడిపాక, మామిడిగొంది, లింగనపల్లి, దేవీపట్నం మండలంలోని అంగుళూరు గ్రామాల నిర్వాసితులకు 90 జీఓ ప్రకారం ఒక్కోఇంటికి 3లక్షల 15వేల వ్యయంతో కాలనీలు నిర్మించారు. 2015 వ సంవత్సరంలో జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌  ప్రభుత్వంతో మాట్లాడి ఈ జీఓ వచ్చేలా చేసారు. ఇక్కడ 315 స్కేర్‌ ఫీట్‌ (చదరపు అడుగులు)లలో 17 అడుగుల తొమ్మిది అంగుళాల పొడవు, 17 అడుగుల ఆరు అంగుళాల వెడల్పుతో ముందు హాలు వచ్చేలా కాలనీలు నిర్మించారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు వచ్చేటప్పటికి కేవలం రెండు లక్షలతో సరిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. కనీసం 5లక్షల వ్యయంతో గదులు పెరిగేలా ఇళ్లు నిర్మించాలని నిర్వాసితులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు