‘పప్పు’లేని మెతుకు నూనెకు నోచుకోని బతుకు

3 Jul, 2016 01:49 IST|Sakshi
‘పప్పు’లేని మెతుకు నూనెకు నోచుకోని బతుకు

5 నెలలుగా అందని కందిపప్పు
ఏడాదిన్నరగా నిలిచిపోయిన పామాయిల్
నిర్వీర్యమవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ
నెలల తరబడి అందని సరుకులు
జిల్లాలో 7.79 లక్షల ఆహారభద్రత కార్డులు
బహిరంగ మార్కెట్‌లో మండుతున్న ధరలు
బియ్యం, చక్కెర, గోధుమలతోనే సరి

జోగిపేట: బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు కొని తినలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చౌక ధరల దుకాణాల ద్వారా రాయితీపై నిత్యావసర వస్తువులను అందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. సరఫరాను బియ్యం, చక్కెర, గోధుమలకే పరిమితం చేసింది. నిల్వలు లేవని గతంలో పసుపు, ఉప్పు, కారం, పామాయిల్, గోధుమ పిండి, చింతపండు సరఫరాలను నిలిపివేసిన ప్రభుత్వం 5 నెలలుగా కందిపప్పును కూడా ఆపేసింది. దీంతో నిత్యావసర వస్తువులు మార్కెట్‌లో కొనలేక లబ్ధిదారులు ఆర్థిక భారంతో  సతమతమవుతున్నారు. కరువుతో అల్లాడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలపై కనికరం చూపాల్సిన ప్రభుత్వం కనీసం పప్పు మెతుకులకు నోచుకోకుండా చేసిందని ప్రజలు వాపోతున్నారు.

 జిల్లాలో 1077 గ్రామ పంచాయతీలలో 7.79 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. వీటికి ప్రతి నెలా బియ్యంతో పాటు గోధుమలు పంపిణీ చేస్తున్నారు. బయట మార్కెట్‌లో ఈ వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంతగా పెరిగిపోవడంత ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తోంది. కానీ నిల్వలు లేవని గడిచిన 5 నెలలుగా కందిపప్పు సరఫరా నిలిపేసింది. కొన్ని సార్లు కార్డుకు అరకిలో ఇచ్చే చక్కెరను కూడా పంపిణీ చేయలేకపోతున్నారు. 

 తొమ్మిది వస్తువులకు మంగళం
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.185కే 9 నిత్యావసర వస్తువులను చౌక ధరల దుకాణాల ద్వారా పేద ప్రజలకు అందించారు. రూ.40 కి పామాయిల్, రూ.50కి కందిపప్పు, రూ.10 పసుపు, రూ.7 గోధుమలు, రూ.5కు ఉప్పు, రూ.6.75కు చక్కెర, రూ.30కి చింతపండు, రూ.20కి కారం, రూ.16.50కి గోధుమ పిండిని పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బియ్యం కోటా లబ్దిదారుడికి రూ.4 కిలోల నుంచి 6 కిలోలకు పెంచి సంతోషపెట్టారు. కానీ తొమ్మిది నిత్యావసర వస్తువుల సంఖ్యను తగ్గించారు. ఉప్పుకారం, గోధుమ పిండి, పసుపు, చింతపండు, పామాయిల్ సరఫరా గత ఏడాది నుంచి నిలిపివేశారు. ఐదు మాసాల క్రితం కంది పప్పును నిలిపివే సారు. 

 కందిపప్పు, చక్కెర ధరలతో అవస్థలు
బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర కిలో రూ.120 నుంచి రూ.150కి పెరిగింది. చౌకధర దుకాణాలలో కిలో రూ.50కేల దొరికేది. చక్కెర కిలో రూ.40 పలుకుతుంది. చౌకధరల దుకాణంలో రూ.14కు వచ్చేది ఈ పరిస్థితిలో ఈ రెండు వస్తువులు చౌక ధరల దుకాణాల్లో లేకపోవడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు.

తొమ్మిది వస్తువులను పునరుద్ధరించాలి
గతంలో చౌక ధరల దుకాణం ద్వారా రూ.185కే తొమ్మిది వస్తువులు ఇచ్చే వారు. ప్రస్తుతం బియ్యం, గోధుమలు, చక్కెర మాత్రమే ఇస్తున్నారు. కంది పప్పు నిలిచిపోవడంతో చాలా కష్టంగా ఉంది. గతంలో పామాయిల్, కందిపప్పులను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేవారు. తిరిగి నిలిపివేసిన వస్తువులన్నింటిని పంపిణీ చేసి ఆదుకోవాలి. పేద ప్రజలు పండుగలు చేసుకోవాలంటేనే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.     - లక్ష్మి, రాంసానిపల్లి

పామాయిల్, కందిపప్పు సరఫరా లేదు
రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు తగ్గిన మాట వాస్తవమే. ప్రస్తుతం చక్కెర, బియ్యం, గోధుమలు, గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో 7 లక్షలకు పైగా ఆహార భద్రత కార్డులున్నాయి. గత సంవత్సరం నుంచి పామాయిల్‌ను సరఫరా చేయడం లేదు.  కొన్ని నెలలుగా కంది పప్పు కూడా రాకపోవడంతో దుకాణాలల్లో పంపిణీ చేయలేకపోతున్నాం. పామాయిల్‌కు బదులుగా వేరే ఆయిల్‌ను పంపిణీ చేసేందుకు అధికారులు యోచిస్తున్నారు. పేదలకు అవసరమయ్యే బియ్యం విషయంలో మాత్రం గట్టి చర్యలు తీసుకుంటున్నాం.
అనురాధ, డీఎస్‌ఓ సంగారెడ్డి

మరిన్ని వార్తలు