కలహాల కమలం !

13 Sep, 2016 00:15 IST|Sakshi
కలహాల కమలం !
  • బీజేపీలో వర్గపోరు
  • గ్రేటర్, రూరల్‌ వర్గాలుగా నేతలు
  • ఈ నెల 17న అమిత్‌ షా రాక
  • కమలం శ్రేణుల్లో అయోమయం
  •  
    సాక్షిప్రతినిధి, వరంగల్‌ : క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే బీజేపీలో నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది. బీజేపీలోని జిల్లా ముఖ్యనేతల మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతోంది. పార్టీ నేతల మధ్య సమన్వయం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 17న జిల్లాకు వస్తున్న దశలో... జిల్లాలోని కమలనాథుల మధ్య ఆధిపత్యపోరు ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.
     
    జిల్లాలో ఒకప్పుడు మంచి పట్టున్న బీజేపీ... దశాబ్ద కాలంగా క్రమంగా బలహీనపడుతూ వస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న తరుణంలో బలపడాల్సిన బీజేపీ జిల్లాలో మరింత బలహీనంగా మారుతోంది.  టీడీపీతో పొత్తుకు తోడు బీజేపీ ముఖ్యనేతల వర్గపోరుతోనే పార్టీకి ప్రస్తుత పరిస్థితి వచ్చిందని కమలం శ్రేణులే అంటున్నాయి. బీజేపీ ముఖ్యనేతలు కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నట్లుగా కనిపిస్తున్నా... అంతర్గతంగా మాత్రం ఎడమొహం, పెడమొహంగానే  ఉంటున్నారు. ఏ పార్టీకి లేని విధంగా బీజేపీకి సంస్థాగతంగా జిల్లాలో రెండు కమిటీలు ఉన్నాయి. పార్టీనీ బలోపేతం చేసేందుకు గ్రేటర్‌ వరంగల్, వరంగల్‌ జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిటీల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. 
     
    బీజేపీ రాష్ట్ర నేతల్లో జిల్లాకు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సింది పోయి... జిల్లా కమిటీల మధ్య ఆధిపత్య పోరును మరింత పెంచుతున్నారు. రాష్ట్ర స్థాయిలో కీలక పదవుల్లో పలువురు ముఖ్య నేతలు... జిల్లా కమిటీల్లోని నేతలను వర్గాలుగా విభించుకుని ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు ముఖ్య నేతలు పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను నిర్వహించడం పక్కనబెట్టి... సొంత ప్రయోజనాల కోసం గ్రూపు రాజకీయాలకు పాల్పడున్నారని బీజేపీ మొదటితరం కార్యకర్తలు వాపోతున్నారు. ‘పార్టీ ఇచ్చిన అవకాశంతో చట్టసభల్లో పదవులు పొందిన వారు జిల్లాలో ఎక్కువ మందే ఉన్నారు.
     
    వీరంతా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నారు’ అని అంటున్నారు.  అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో కీలక నేతలు ఒక్కసారిగా దగ్గరైనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లు వర్గాలుగా ఉన్న వీరి ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం తమ దారిలోనే వెళ్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్యనేతల కార్యక్రమాలు జిల్లా కేంద్రంలో జరిగిన సందర్భాల్లో గ్రూపుల పోరు బయటపడుతోంది. సంస్థాగతంగా రెండు జిల్లాలకు సమాన హోదా ఉండడంతోనే ఈ ఇబ్బంది కలుగుతోందని బీజేపీ శ్రేణులు వాపోతున్నాయి. సంస్థాగతంగా రెండు కమిటీలు ఉండడం వల్ల జాతీయ స్థాయి నేతల కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఏ జిల్లా అధ్యక్షుడు నేతృత్వం వహించాలనే విషయంలో విభేదాలు పొడసూపుతున్నాయని అంటున్నారు. సెప్టెంబరు 17న నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా జిల్లాకు వస్తున్నారు.  
     
    అమిత్‌ షా పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ గ్రేటర్‌ వరంగల్, వరంగల్‌ జిల్లాల ముఖ్యనేతల సమావేశం ఇటీవల హసన్‌పర్తిలో జరిగింది. ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించాలనే విషయంపై రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. గ్రేటర్‌ వరంగల్‌ అధ్యక్షుడు కార్యక్రమానికి అధ్యక్షత వహించడాన్ని వ్యతిరేకిస్తూ వరంగల్‌ జిల్లా కార్యకర్తలు సమావేశం నుంచి వెళ్లిపోయారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లోని కీలక నేతలు పదుల సంఖ్యలో అక్కడ ఉన్నా... ఈ విషయంలో ఎలాంటి సమన్వయం కోసమూ ప్రయత్నించలేదని తెలిసింది. ముఖ్యనేతల తీరు ఇలాగే ఉంటే పార్టీ జాతీయ అధ్యక్షుడి పర్యటన ఎలా జరుగుతుందోనని బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
     
మరిన్ని వార్తలు