ఎన్నాళ్లీ వెట్టిచాకిరీ?

10 Jun, 2017 00:23 IST|Sakshi
ఎన్నాళ్లీ వెట్టిచాకిరీ?

దయనీయం  ఆశ కార్యకర్తల జీవనం
నాలుగేళ్లగా అందని యూనిఫారాలు, అలవెన్సులు
కనీస వేతనాలకూ నోచుకోని వైనం!


వైద్య, ఆరోగ్య శాఖలో ఎంతో ప్రాముఖ్యమైన మాతా, శిశు మరణాలు తగ్గించడానికి, గర్భిణి, బాలింతల సంరక్షణ కోసం ప్రభుత్వం ఆశ వర్కర్లను నియమించింది. అయితే వీరికి వేతనాలివ్వకుండా పారితోషికాలతో ప్రభుత్వం నెట్టుకొస్తోంది.  ఏ విధమైన వేతనం నిర్ణయించకుండా ప్రభుత్వం వీరితో వెట్టిచాకిరీ చేయించుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తే జీవనోపాధి మెరుగుపడుతుందన్న ఆశతో  దశాబ్ద కాలంగా విధులు నిర్వర్తిస్తున్నా వారు కనీస వేతనాలకు నోచుకోలేదు.

వేపాడ(ఎస్‌.కోట): జిల్లా వ్యాప్తంగా సుమారు 2500 మంది ఆశ కార్యకర్తలు  వైద్య ఆరోగ్య శాఖలో  సేవలు అందిస్తున్నారు. మహిళా ఆరోగ్య కార్యకర్తలతో సమానంగా గ్రామ స్థాయిలో వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమం, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత, క్లోరినేషన్, జనన మరణాల నమోదు, న్యూట్రిషన్,  కుష్ఠు, క్షయ, ఫైలేరియా, ఎయిడ్స్, ప్రతీ ఏడాది నిర్వహించే పల్స్‌పోలియో, ఇంటింటి ప్రచారం, సర్వేలకు ఆశ కార్యకర్తలు సేవలందిస్తున్నారు.  నిరంతరం గ్రామ స్థాయిలో సేవలందించిన అరకొర ప్రోత్సాహమే తప్ప కనీస వేతనానికి నోచుకోలేదు. సమావేశాలకు వెళ్లే అలవెన్స్, యూనిఫారాలు కూడా అందించకపోవటంతో కుటుంబ పోషణ భారంగా తయారైందంటు వీరు ఆవేదన చెందుతున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో 20 ఏళ్లుగా  పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు నెలకు రూ.400 గౌరవ వేతనం ఇస్తున్నారంటే ప్రభుత్వం పనితీరు అర్ధం చేసుకోవచ్చు.  పని భారమే తప్ప కనీస వేతనాలు లేకపోవటంతో ఆర్థిక పరమైన సమస్యలు, మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ప్రతి నెలా పీహెచ్‌సీల్లో సమావేశాలకు రప్పించే వీరికి టీఏ, డీఏలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే యూనిఫాం అలవెన్స్‌ రూ.500లకు కూడా నాలుగేళ్లగా నోచుకోవడం లేదు.  సమావేశాలకు యూనిఫాంతో రాలేదంటూ ఇచ్చే పారితోషికాన్ని తగ్గిస్తున్నారని పలువురు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేరళలో 7500 ఇస్తున్నారు...
కేరళ రాష్ట్రంలో ఆశ కార్యకర్తలకు నెలకు రూ.7500లు గౌరవ వేతనం ఇస్తున్నారు. పక్కనే ఉన్న తెలంగాణాలో కూడా నెలకు రూ.ఆరు వేలు ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించి అమలు చేయటంలో నిమగ్నమైంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ఆశ కార్యకర్తలకు కనీస వేతనం, యూనిఫారాలు అలవెన్స్‌ మంజూరు ఉత్తర్వులు ఇవ్వటానికి వెనుకంజ వేస్తోంది. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి పని భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని,  కనీస వేతనం రూ.ఆరు వేలు ఇవ్వాలంటు ఆశ కార్యకర్తలు కోరుతున్నారు .

12న చలో డీఎంహెచ్‌వో కార్యాలయం
ఆశ కార్యకర్తల సమస్యలను పరిష్కరించి కనీస వేతనం చెల్లించాలంటూ ఏపీ ఆశ కార్యకర్తల యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఈ నెల 12న చలో డీఎంహెచ్‌వో కార్యాలయం నిర్వహిస్తున్నారు.

కనీస వేతనానికి పోరాటం
ఏళ్లు గడుస్తున్నా ఆశ కార్యకర్తలకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేవు. యూనియన్‌ తరఫున సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతాం. కుటుంబ పోషణకు ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా సహాయ పడేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో సమస్యలను పరిష్కారించాల్సి వుంది. కేరళ, తెలంగాణ రాష్ట్రాల మాదిరిగా ఏపీలో కూడా రూ.ఆరు వేలు గౌరవ వేతనం ఇవ్వాలి.
–చల్లా జగన్, జిల్లా కార్యదర్శి, సీఐటీయూ

ఆదరణ చూపండి
పదేళ్లుగా గ్రామ స్థాయిలో వైద్యసేవలతో పాటు సర్వేలకు సహాయ పడుతున్న ఆశ కార్యకర్తలకు  ప్రభుత్వ ఆదరణ కరువైంది. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నాం. యూనిఫారాలు అలెవెన్స్‌ ఇవ్వరు..అంతంత ప్రోత్సాహాలతో జీవనం సాగించలేకపోతున్నాం. ప్రభుత్వం స్పందించి కనీస వేతనం అందించి ఆదుకోవాలి.
–దేవుపల్లి సన్యాసమ్మ, జిల్లా కార్యదర్శి, జిల్లా ఆశ వర్కర్లు యూనియన్‌

మరిన్ని వార్తలు