కేసుల పరిష్కారంలో వేగం తప్పనిసరి

7 Aug, 2016 20:53 IST|Sakshi
కేసుల పరిష్కారంలో వేగం తప్పనిసరి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత
 
గుంటూరు లీగల్‌: జిల్లాలోని న్యాయమూర్తులు తమ కోర్టులలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత  సూచించారు. జిల్లా న్యాయమూర్తుల సమీక్ష సమావేశం ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్లో నిర్వహించారు. జిల్లాలోని సీనియర్‌ సివిల్‌ జడ్జి  కోర్టుల పనితీరును స్వయంగా ప్రధాన న్యాయమూర్తి సుమలత సమీక్షించారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల పనితీరును అదనపు జిల్లా జడ్జిలు సమీక్షించారు. జూన్, జులై మాసంలో నమోదైన కేసులు, పరిష్కారమైన కేసుల వివరాలను ఆమె తెలుసుకున్నారు. కేసుల పరిష్కారంలో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన పలు తీర్పులను ఉటంకిస్తూ కేసుల పరిష్కారంలో  ఆయా తీర్పులను ప్రామానింగా తీసుకోవాలని సూచించారు. జిల్లాలో జూన్, జూలై మాసాల్లో ఎక్కువ కేసులు పరిష్కరించిన ఒకటో అదనపు జిల్లా జడ్జి గుమ్మడి గోపీచంద్, మంగళగిరి సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.చింరజీవులు, పిడుగురాళ్ళ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.సుజాతను జిల్లా ప్రధాన న్యాయమూర్తి  ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా న్యాయమూర్తుల సమీక్ష  సమావేశం పూర్తి స్థాయిలో డిజిటల్‌ పద్ధతిలో నిర్వహించడం ఇదే ప్రథమం. పవర్‌ పాయంట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జిల్లాలోని  వివిధ కోర్టులలో ఉన్న కేసుల వివరాలు, పరిష్కార మైన కేసుల వివరాలను చూపించారు. సమావేశంలో మానవత్వం గురించి  తెలిపే సన్నివేశాలు, కుటుంబ సభ్యుల పట్ల చూపే ప్రేమ, అనురాగాలు తదితర సన్నివేశాలను వీడియో ద్వారా చూపారు. సీనియర్‌ న్యాయమూర్తులు, జూనియర్‌ న్యాయమూర్తులతో అనుసంధానమై వారికి ఉన్న అనుమానాలను నివత్తి చేస్తూ కేసుల పరిష్కారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బోధించారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి జిల్లాలో కేసుల పరిష్కారంలో వేగం పెంచి జిల్లా న్యాయవ్యవస్థకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తికి మంచి పేరు తెస్తామని న్యాయమూర్తులు హామీ ఇచ్చారు. 
మరిన్ని వార్తలు