ఉపాధిలో నెం.1

9 Jun, 2016 02:31 IST|Sakshi
ఉపాధిలో నెం.1

ఈజీఎస్ అమలులో జిల్లాకు ప్రథమస్థానం
అత్యధిక కూలీలకు ఉపాధి కల్పించిన ఘనత
కూలీ డబ్బుల చెల్లింపుల్లోనూ అగ్రస్థానం
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రశంసలు

అడిగిన కూలీలందరికీ ఉపాధి పని.. పనిచేసిన కూలీలకు సకాలంలో చెల్లింపులు.. జాబ్‌కార్డులున్న వారిలో ఎక్కువ మందికి వందరోజుల పని కల్పించడం.. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిర్దేశించిన లక్ష్యంలో మెరుగైన పురోగతి.. నీటి  గుంతల తవ్వకాల్లో లక్ష్యానికి నాలుగురెట్ల సాధన.. ఇన్ని రికార్డులతో గ్రామీణాభివృద్ధిలో పరుగులు పెడుతూ రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పలు కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేయడంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ.. జిల్లా నీటి యాజమాన్య సంస్థను ప్రశంసలతో ముంచెత్తింది. బుధవారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో డ్వామా పీడీ హరితతోపాటు సిబ్బందిని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అభినందించారు.

లక్ష్యాలు అధిగమించి..
2016-17 వార్షిక సంవత్సరంలో గత నెలాఖరు నాటికి జిల్లాలోని కూలీలకు 44.06 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. అటు పట్టణ వాతావరణ, ఇటు గ్రామీణ ప్రాంతం తోడవడంతో లక్ష్యసాధన కొంత ఇబ్బందికరమైనప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఉపాధికి ప్రత్యేక చొరవ తీసుకుని ఏకంగా 45.85 లక్షల పనిదినాలు కల్పించారు. నిర్దేశించిన లక్ష్యంలో 104.08 శాతం పురోగతి సాధించి పని కల్పించడంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఖమ్మం (91.88%), నిజామాబాద్ (88.54%) జిల్లాలున్నాయి.

 1,644 కుటుంబాలకు వందరోజుల పని..
ఈజీఎస్ పథకంలో ప్రతి కుటుంబానికి వందరోజుల పని కల్పించాలి. కరువు నేపథ్యంలో పనిదినాలను 150కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తాజా వార్షిక సంవత్సరంలో ఇప్పటివరకు వంద రోజుల పనిదినాలు పొందిన కుటుంబాలు 1,644 ఉన్నాయి. రాష్ట్రంలో వందరోజుల పనిదినాలు పొందిన కుటుంబాలు జిల్లా నుంచే నమోదు కావడం గమనార్హం.

ఫాంపండ్స్.. అదుర్స్
రైతుల పొలాల్లో నీటి కొలను (ఫాంపండ్స్) ఏర్పాటు ప్రక్రియను ఈజీఎస్‌లో పొందుపర్చారు. ఈ క్రమంలో 2016- 17 వార్షిక సంవత్సరంలో జిల్లాకు ఫాంపండ్స్ లక్ష్యాన్ని 1000గా ప్రభుత్వం నిర్ధారించింది. కానీ జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకుని ఈ లక్ష్యాన్ని ఏకంగా 8,700 పెంచు తూ ప్రభుత్వ అనుమతి తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు మూడు వేల ఫాంపండ్స్ నిర్మాణ పనులు మొదలు పెట్టగా.. ఇప్పటివరకు 550 ఫాంపండ్స్ పూర్తయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక ఫాంపండ్స్ నిర్మించింది జిల్లాలోనే.

 చెల్లింపుల్లోనూ జోరు..
ఉపాధి పథకం కింద పనిచే సిన ప్రతి కూలీకి మూడు రోజుల్లోగా డబ్బులు చెల్లించాలి. అయితే పలు జిల్లాల్లో పోస్టాఫీస్ సిబ్బంది ద్వారా డబ్బులు చెల్లిస్తుండగా.. జిల్లాలో మాత్రం కూలీలకు ప్రత్యేకం బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిల్లో ఆన్‌లైన్ పద్ధతిలో డబ్బులు జమచేస్తున్నాడు. కూలీ డబ్బుల చెల్లింపుల ప్రక్రియ ఇతర జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డిజిల్లాలో వేగంగా జరుగుతుంది. ఈక్రమంలో కూలీ చెల్లింపుల విభాగంలోనూ జిల్లా ముందువరుసలో ఉంది.

నెలాఖర్లోగా 56 గ్రామాల్లో...
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలోనూ జిల్లా దూసుకెళ్తోంది. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ కింద పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈక్రమంలో త్వరలో జిల్లాలో 56 గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించనుంది. ఈనెలాఖర్లోగా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ప్రాజెక్టు డెరైక్టర్ హరిత ‘సాక్షి’తో అన్నారు. మొత్తంగా నెలాఖర్లోగా బహిరంగ మల విసర్జన నిషేధిత కేటగిరీలో 56గ్రామాలను ప్రకటిస్తామని ఆమె అన్నారు.

మరిన్ని వార్తలు