నిజాం కాలంలోనే జిల్లాకోర్టు

3 Sep, 2016 23:38 IST|Sakshi
నాజీం జిల్లా కోర్టు నిర్వహణ జరిగిన సంస్థానాధీశుల వాసుదేవమ్మ తోట బంగ్లా ఇదే
– 1950–51లో కోర్టు నిర్వహణ 
– ఈ ఆధారంతోనే వనపర్తికి జిల్లా అదనపు కోర్టు సాధించాం
: సీనియర్‌ న్యాయవాది బాల్‌రెడ్డి
వనపర్తి : నిజాం కాలంలోనే ‘నాజీం జిల్లా’ పేరుతో వనపర్తిలో జిల్లాకోర్టు ఏర్పాటు చేసినట్లు స్థానిక సీనియర్‌ సిటిజన్లు వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు ఏ పత్రికల్లో, టీవీచానెళ్లలో ఈ విషయాన్ని వెల్లడించలేదు. స్థానికుల్లో చాలా మందికీ ఈ విషయమే తెలియదు. వనపర్తి జిల్లా ఏర్పడుతున్న సందర్భంగా వనపర్తికి చెందిన సీనియర్‌ న్యాయవాది జి. బాల్‌రెడ్డిని సాక్షి పలకరించింది. ప్రస్తుతం న్యాయవాది బాల్‌రెడ్డికి ఎనబై సంవత్సరాలు ఆయన న్యాయవ్యవస్థకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను సాక్షితో పంచుకున్నారు. నాజీం జిల్లా నిర్వహణను తాను విద్యార్థిదశలో ఉన్నప్పుడు చూశానని చెప్పారు. నాగవరం గ్రామంలోని రాజావారి వాసుదేవమ్మ తోట బంగ్లాలో నాజీం జిల్లా నిర్వాహణ జరిగేదన్నారు. సంస్థానాధీశుల కాలంలో కోర్టుల నిర్వహణ బాధ్యతలను నిజాం నవాబులు జాగీర్దార్లు అప్పగించారని, కోర్టు నిర్వహణ ఖర్చులు వారి ద్వారానే చెల్లింపులు జరిగేవని ఆయన తెలిపారు. సంస్థానాలు ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేసిన తర్వాత జిల్లాకు ఒక్కటే జిల్లాస్థాయి కోర్టు ఉండాలని ఇక్కడి కోర్టును మహబూబ్‌నగర్‌కు తరలించారు. 1962 నుంచి తాను న్యాయవాది వృత్తిలో పనిచేస్తున్నానని చెప్పారు.
చిన్న చిన్న సంస్థానాల్లో మున్సిఫ్‌ కోర్టులు ఉండేవి 
గోపాల్‌పేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, గద్వాల, ఆత్మకూర్‌ నిజాం ఆధీనంలో ఉన్న చిన్న సంస్థానాల్లో అదాలత్‌ మున్సిఫ్‌ కోర్టులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పైకోర్టు (జిల్లా కోర్టు) రావాలంటే వనపర్తి నాజీం జిల్లా కోర్టుకు వచ్చేవారు. ఇక్కడి నుంచి పైకోర్టుకు వెళ్లాలంటే హైదరాబాద్‌లో నవాబుల ఆధీనంలో నిర్వహించే ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాల్సి ఉండేదన్నారు. అన్ని సంస్థానాలకు వనపర్తి మధ్యభాగంలో ఉన్న కారణంగా ఇక్కడి నాజీం జిల్లాను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
1950–51వరకు నాజీం జిల్లా కోర్టు
స్వాతంత్య్రానికి పూర్వం నుంచి సంస్థానాలు ఇండియన్‌ యూనియన్‌లో విలీనం అయిన తర్వాత జాగీర్దార్‌ వ్యవస్థను రద్దు చేసే వరకు 1950–51 వరకు వనపర్తిలోని వాసుదేవమ్మ తోటలో నాజీం జిల్లా కోర్టు నిర్వాహణ జరిగింది. కొన్ని అదాలత్‌ మున్సిఫ్‌ కోర్టులు రద్దు చేయబడ్డాయి.
ఈ ఆధారంతోనే వనపర్తికి జిల్లా అదనపు కోర్టును సాధించాం
సంస్థానాధీశుల కాలంలోనే వనపర్తిలో నాజీం జిల్లా పేరుతో జిల్లా కోర్టు ఉండేదనే ఆధారం చూపించి తాను వనపర్తి బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో హైకోర్టుకు నివేధించి వనపర్తికి అదనపు జిల్లా కోర్టును మంజూరు చేయించామని న్యాయవాది బాల్‌రెడ్డి చెప్పారు. కొన్నేళ్ల క్రితమే ప్రస్తుత సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ మదన్‌బీ లోకూర్‌ చేతుల మీదుగా అదనపు జిల్లా కోర్టును ప్రారంభించుకున్నామని అన్నారు. 
నా చిన్నతనంలో చూశాను
అవునూ.. చిన్న తనంలో మా ఊర్లోని వాసుదేవమ్మ తోటబంగ్లలో కోర్టు నడిచేది. మంది మార్బలంతో ఒక్కోరోజు చాలామంది వచ్చేవారు. చదవుకునే రోజుల్లో సంస్థానం నుంచి ఎవరైనా వస్తే ఆసక్తిగా వెళ్లి చూసేవాళ్లం. ఇక్కడినుంచి వనపర్తి పాతకోటలోని జైలుకు చాలామందిని తీసుకెళ్లేవారు.
– బత్తిని రాంరెడ్డి, రిటైడ్‌ ఉద్యోగి, నాగవరం, వనపర్తి
 
మరిన్ని వార్తలు