ఎంపీపీ దీక్ష భగ్నం

26 Sep, 2016 23:51 IST|Sakshi
గద్వాల : గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలంటూ మూడు రోజులుగా స్థానిక కృష్ణవేణిచౌరస్తాలో కొనసాగిస్తున్న ఎంపీపీ సుభాన్‌ ఆమరణ నిరాహార దీక్షను ఎట్టకేలకు పోలీసులు భగ్నం చేశారు. సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు సుమారు 20మంది పోలీసులు శిబిరానికి చేరుకుని దీక్ష విరమించాలని ఎంపీపీని కోరారు. అందుకు ఆయన ససేమిరా అనడంతో దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు యత్నించారు. వారిని జేఏసీ నాయకులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, విద్యార్థులు అడ్డుకున్నారు. 
 
ఈ క్రమంలో పోలీసులు, జేఏసీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరికొకరు తోసుకోగా, పోలీసులు బలవంతంగా ఎంపీపీని ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ఎంపీపీని పోలీసు వాహనంలో ఎక్కించి బలవంతంగా ఏరియా ఆస్పత్రికి తరలించి సెలైన్‌ బాటిల్‌ ఎక్కించి చికిత్సలు అందించారు. వీరి చర్యను నిరసిస్తూ జేఏసీ, టీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీక్షను భగ్నం చేసినంత మాత్రాన గద్వాల జిల్లా ఉద్యమం ఆగదని జేఏసీ నాయకులు అన్నారు. 
 
మరిన్ని వార్తలు