అధైర్యం వద్దు.. అండగా ఉంటాం..

11 Nov, 2016 01:25 IST|Sakshi
  • దివీస్‌ బాధితులకు వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే రాజాల భరోసా
  • బాధిత గ్రామాల్లో పార్టీ పర్యటన  
  • గూండాల దాడిలో గాయపడినవారికి పరామర్శ
  • రాక్షస పాలన సాగిస్తున్నారని విమర్శ ∙
  • 17న జగన్‌ రానున్నారని వెల్లడి 
  • తొండంగి : 
    దివీస్‌ పరిశ్రమ వల్ల కలిగే నష్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న బాధిత గ్రామాల ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన ఆ పార్టీకి చెందిన పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు  పెండెం దొరబాబు, ముత్యాల శ్రీనివాస్, తోట సుబ్బారావునాయుడు పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, ఇతర నాయకులతో కలిసి కొత్తపాకలు, పంపాదిపేట, తాటియాకులపాలెం, నర్శిపేట, దానవాయిపేట గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పంపాదిపేటలో ప్రజలనుద్దేశించి కన్నబాబు ప్రసంగించారు. అధికార టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకే పచ్చని కోన తీరంలో ప్రజల మనుగడను భంగపరుస్తూ, కాలుష్య కారక దివీస్‌ పరిశ్రమను పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న ప్రజలపై అక్రమ కేసులు పెట్టడంతోపాటు, వారి స్వేచ్ఛకు భంగం కలిగేవిధంగా దీర్ఘకాలంగా 144 సెక్షన్‌ అమలు చేయడం అన్యాయమన్నారు. దివీస్‌ను వ్యతిరేకిస్తున్న ప్రజలపై దాడులు చేయించడం, పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేయడంవంటివి చూస్తూంటే కోన ప్రాంతంలో రాక్షస పాలన సాగుతున్నట్టుగా ఉందన్నారు. కొత్తపాకలు గ్రామంలో బుధవారం మహిళలపై గూండాలతో దాడులు చేయించి, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అంగుళూరి అరుణ్‌కుమార్‌ను, ఆయన భార్యను నిర్బంధించడం, గాయపడిన మహిళలు వైద్యం కోసమని తుని ఆస్పత్రికి వెళ్తే అక్కడకు కూడా కొంతమందిని పంపి దాడులు చేయించడం పరమ దుర్మార్గమని అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ వ్యవహారం పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కన్నబాబు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోన ప్రజలు కోరడంలేదని.. నిరుద్యోగ భృతి అడ గలేదని.. కొత్తగా ఇళ్లు ఇమ్మనడంలేదని.. తమ బతుకు తమను బతకనిస్తే చాలంటున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న దివీస్‌ బాధిత ప్రజలకు భరోసానిచ్చేందుకు తమ పార్టీ అధ్యక్షుడు, శాసనసభలో విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17న ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నారని కన్నబాబు చెప్పారు.
    ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, దివీస్‌ పరిశ్రమ వల్ల ఈ ప్రాంత ప్రజలు ఎంతో విలువైన భూములను కోల్పోవడంతోపాటు.. పరిశ్రమ కాలుష్యం వల్ల వలసపోవాల్సిన దుస్థితిని ఎదుర్కోనున్నారని అన్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న అమాయక ప్రజలపై పోలీసులను నియోగించి అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దివీస్‌ బాధిత గ్రామస్తులపై దాడులు చేస్తూ అరాచకాన్ని సృష్టిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తీరప్రాంత ప్రజల కోసం పార్టీ సహకారంతో ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
    అంతకుముందు కొత్తపాకలు గ్రామంలో బుధవారం దళారులు చేసిన దాడిలో గాయపడిన అంగుళూరి లోవతల్లి, అంగుళూరి స్వర్ణ, లక్షి్మలను వైఎస్సార్‌ సీపీ నాయకులు పరామర్శించారు. వారికి కొత్తపాకలు, పంపాదిపేట గ్రామాల్లో బాధిత ప్రజలు తమ ఇబ్బందులను వివరించారు. పార్టీ జిల్లా నాయకులు బాలాజీ, ముత్యాల సతీష్, జిల్లా కమిటీ సభ్యుడు పేకేటి రాజేష్, మండల నాయకులు మేరుగు ఆనందహరి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చొక్కా కాశీ ఈశ్వరరావు, పేకేటి సూరిబాబు, మద్దుకూరి వెంకటరామయ్యచౌదరి, యూత్‌ కన్వీనర్‌ ఆరుమిల్లి ఏసుబాబు చౌదరి, బూర్తి కృష్ణ తదితరులున్నారు.
     
>
మరిన్ని వార్తలు