14వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు

31 Dec, 2016 02:37 IST|Sakshi
14వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు

విద్యుత్‌ బకాయిలు, పీడబ్ల్యూఎస్‌ స్కీం, గ్రామ
పంచాయతీల నిర్వహణ పేరిట 60 శాతం కోత
ఇప్పటికే పంచాయతీలను వేధిస్తోన్న నిధుల కొరత  
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్పంచ్‌ల ఆగ్రహం


దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా తయారైంది గ్రామ పంచాయతీల పరిస్థితి. ఇప్పటికే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మరింత కుదేలు కానున్నాయి. కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధుల్లో వివిధ సాకులు చూపి 60 శాతం కోత పెట్టడం సర్పంచ్‌లను ఆగ్రహానికి గురి చేస్తోంది. గ్రామాల పురోగతికి చేయూతనివ్వాల్సిందిపోయి వచ్చిన నిధులను వేరే వాటికి మళ్లించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్, పీడబ్ల్యూఎస్‌ బకాయిలు చెల్లించాల్సిందేనని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

యాదాద్రి :గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1158  గ్రామ పంచాయతీలకు ఇటీవల మంజూరైన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 60 శాతం నిధులను వివిధ అవసరాల పేరుతో మళ్లిస్తోంది.  ప్రధానంగా గ్రామాల్లో  పేరుకుపోతున్న  సమస్యలకు పరిష్కారం చూపాలనే కోణంలో  కేంద్రం నేరుగా పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం వాటిని దారి మళ్లిస్తోంది.

ముందుగానే చెక్కులు..
14వ ఆర్థిక సంఘం నిధుల్లో 60 శాతం దారి మళ్లుతున్నాయి. ఇందులోంచి 30 శాతం మేరకు విద్యుత్‌ బకాయిలకు, 20శాతం   పీడబ్ల్యూఎస్‌(పబ్లిక్‌ వాటర్‌ సప్లయ్‌ స్కీం)  స్కీం నిర్వహణ, పది శాతం గ్రామ పంచాయతీ నిర్వహణ పేరిట కోత విధిస్తోంది. ఇందుకు గాను ముందస్తుగానే సర్పంచ్‌ల నుంచి చెక్కు లు తీసుకుంటున్నారు.  చెక్కులు ముందస్తుగా ఇస్తేనే గ్రామం లో చేసిన వివిధ అభివృద్ధి పనులకు ఎంబీ రికార్డుల మేరకు చెక్కులపై కౌంటర్‌ సంతకాలు చేస్తున్నారని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. ఇది కూడా కేవలం నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఈఓపీఆర్‌డీ కౌంటర్‌ సంతకంతోనే సాగుతోంది.

సర్పంచ్‌లకు నోటీసులు
15 ఏళ్ల క్రితం ఏర్పడిన  సీపీడబ్ల్యూఎస్‌ స్కీం బకాయి విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని ట్రాన్స్‌కో ఉన్నతాధికారుల నుంచి సర్పంచ్‌లకు నోటీసులు అందాయి. ఉదాహరణకు గుండాల మండలంలోని తుర్కలాషాపురంలో నాలుగు సీపీడబ్ల్యూఎస్‌  స్కీం మోటార్ల విద్యుత్‌ బకాయిల కింద రూ.9.74లక్షలు చెల్లించాలని, ఇదే గ్రామ పంచాయతీ పరిధిలోని వంగాల గ్రామంలో గల మరో రెండు  పీడబ్ల్యూఎస్‌   స్కీం విద్యుత్‌ మోటార్ల బకాయి బిల్లు కింద రూ.4.56లక్షలు చెల్లించాలంటూ సర్పంచ్‌లకు నోటీసులను అందజేశారు.

తుర్కలషాపురం పంచాయతీ నుంచి బిల్లు వసూలు
14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి  పీడబ్ల్యూఎస్‌  స్కీం నిర్వహణ కింద 20శాతం గ్రాంట్‌ చెల్లించాని జీఓఆర్‌టీ నెంబర్‌ 544 పీఆర్, ఆర్‌జీ తేదీ 28/08/2015న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు తుర్కలషాపురం గ్రామ పంచాయతీ నుంచి అధికారు లు రూ.1,18,498 లక్షలు వసూలు చేశారు.  గ్రామాల్ని గ్రామా లే పాలించుకోవాలన్నది 73వ రాజ్యాంగ సవరణ ఉద్దేశం.  ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం నేరుగా ఆర్థిక సంఘం నిధులను గ్రా మ పంచాయతీలకు  విడుదల చేస్తోంది. గ్రామాల అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉండగా,  ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్‌ బకాయిలు,   పీడబ్ల్యూఎస్‌  స్కీం నిర్వహణ, పంచాయతీల నిర్వహణ పేరిట ముందస్తుగానే ఈఓఆర్‌డీల  కౌంటర్‌ సంతకం ప్రయోగిస్తూ బి ల్లులు వసూలు చేస్తున్నారు. నిధులలేమితో గ్రామాల్లో సమస్య లు పేరుకుపోతున్నాయని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   
 

మరిన్ని వార్తలు