ప్రజల మధ్యే సభ నిర్వహించాలి

30 Nov, 2016 23:36 IST|Sakshi
ప్రజల మధ్యే సభ నిర్వహించాలి
దివీస్‌ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్‌
తహసీల్దార్‌కు వినతిపత్రం
తొండంగి : దివీస్‌ బాధిత గ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వారి మధ్యే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సభ నిర్వహించాలని దివీస్‌ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. రెండు రోజుల క్రితం బాధిత గ్రామాలకు చెందిన కొంత మంది రైతులతో సమస్యలపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్‌ రమన్నారంటూ తొండంగి తహసీల్దార్‌ టి.వి.సూర్యనారాయణ బాధిత గ్రామాల  ప్రజలకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పంపాదిపేట, తాటియాకులపాలెం, కొత్తపాకలు, నర్శిపేట, ఒంటిమామిడి తదితర గ్రామాల ప్రజలు దివీస్‌ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మట్ల ముసలయ్య, గంపల దండు, మేరుగు ఆనందహరి, యనమల సత్తిబాబు, కుక్కా కొండ, కుక్కా సత్యనారాయణ, బద్ది బుజ్జి, తాటిపర్తి బాబూరావులతోపాటు మరికొంత మంది రైతులు బుధవారం తహసీల్దార్‌ను కలిశారు. రెవెన్యూ అధికారులు కోరిక మేరకు జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు బాధిత గ్రామాల ప్రజలమంతా కలిసి చర్చించుకున్నామన్నారు. కలెక్టర్‌ తమ సమస్యలను తెలుసుకునేందుకు నిర్ణయించుకుంటే బాధిత గ్రామంలో ఎక్కడైనా సభ ఏర్పాటు చేసుకోవచ్చని తహసీల్దార్‌కు వివరించారు. 
గతంలో పంపాదిపేటలో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో కాలుష్య దివీస్‌ ల్యాబోరేటరీస్‌ పరిశ్రమ వద్దన్న బాధిత గ్రామాల ప్రజలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. తర్వాత సుమారు 1200 మంది సంతకాలు చేసిన వినతిపత్రాలు కలెక్టర్‌కు ఇచ్చేందుకు వెళ్లినా పట్టించుకోలేదు. శాంతియుతంగా పోరాడుతున్న ప్రజలపై అక్రమ కేసులు బనాయించి నానా ఇబ్బందిపెడుతుంటే స్పందించలేదు. మూడు నెలలుగా 144 సెక్ష¯ŒS అమలు చేసి,  పోరాటానికి వచ్చిన నాయకులు, మహిళలపై పోలీసులు దాడి చేసినప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. తమ భూములకు ప్రభుత్వం ఎన్ని లక్షలు పరిహారం ప్రకటించినా సరే కాలుష్య పరిశ్రమకు అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు. ఇప్పుడు కొత్తగా తమతో చర్చించేందుకు రమ్మనడంపై ప్రజల్లో అనేక దురభిప్రాయాలు వస్తాయన్న కారణంగా జిల్లా కలెక్టర్‌ను కలిసే పరిస్థితి లేదన్నారు. అధికారులు ఎటువంటి చర్చ చేయదలచినా తమ ఉద్యమానికి మద్దతు పలికిన స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టిరాజా, ప్రజా సంఘాల నాయకులు, దివీస్‌ వ్యతిరేక పోరాటకమిటీ సభ్యుల సమక్షంలో బాధిత ప్రజల ముందే సభ నిర్వహించాలని తెలిపారు. ఈ మేరకు తహసీల్దార్‌ సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. 
దీనిపై తహసీల్దార్‌ స్పందిస్తూ దివీస్‌ వ్యతిరేక పోరాటకమిటీ సభ్యుల వినతిపత్రాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అయితే రైతులు, బాధిత ప్రజల అభిప్రాయాలను, అభ్యం తరాలను లిఖిత పూర్వకంగా కలెక్టర్‌కు నేరుగా తెలియజేయాలని దివీస్‌ వ్యతిరేకపోరాట కమిటీ సభ్యులకు సూచించారు. దీనిపై స్పందించిన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ అభిప్రాయాన్ని కలెక్టర్‌కు తహసీల్దార్‌ వినతిప్రతం ద్వారా తెలిపాలని కోరారు. బాధిత గ్రామాల ప్రజలతో చర్చించుకున్న తర్వాతే కలెక్టర్‌ను కలవడంపై సమాచారమిస్తామని తహసీల్దార్‌కు వివరించారు.
మరిన్ని వార్తలు