చల్లారని ‘దివిస్‌’ సెగ

30 Aug, 2016 21:09 IST|Sakshi
చల్లారని ‘దివిస్‌’ సెగ
  • ఆందోళనల నేపథ్యంలో పలు గ్రామాల్లో 144 సెక్షన్‌ అమలు 
  • బాధిత గ్రామాల్లో పర్యటించిన వామపక్ష నేతల బృందం
  • దళితుడిపై సీఐ దౌర్జన్యం చేశారంటూ కొత్తపాకల గ్రామస్తుల రిలే దీక్షలు 
  • ఉద్యమానికి మాలమహానాడు నేతల మద్దతు
  •  
     
    తీర ప్రాంతానికి నష్టదాయకంగా ఉందంటూ దివిస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓ దళితుడిని తుని రూరల్‌ సీఐ కులం పేరుతో దూషించి, కొట్టారని ఆరోపిస్తూ కొత్తపాకల గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం, దీనికి మాల మహానాడు నేతలు మద్దతు పలకడంతో పరిస్థితి వేడెక్కుతోంది. ఆయా ఆందోళనల నేపథ్యంలో పలు గ్రామాల్లో పోలీసులు 144 సెక్ష¯Œæను విధించారు.
     
    తొండంగి :
    తీరప్రాంతంలో రైతులు, మత్స్యకారుల మనుగడ ప్రశ్నార్థమయ్యే దివీస్‌ పరిశ్రమ అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని సీపీఐ(ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి బుగతా బంగార్రాజు డిమాండ్‌ చేశారు. పంపాదిపేటలో పోలీసులు లాఠీచార్జి, ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బాధిత గ్రామాలను సీపీఐ ఏరియా కార్యదర్శి శివకోటి రాజు,  సీపీఐ(ఎంఎల్‌ న్యూడెమోక్రసీ) నాయకుడు జె.వెంకటేశ్వర్లు, సీపీఐ (ఎంఎల్‌ జనశక్తి) నాయకుడు కర్నాకుల వీరంజనేయులు, న్యూడెమోక్రసీ నేత వి.రామన్న, జనశక్తి నాయకుడు బి.రమేష్‌ తదితరులతో కలిసి కొత్తపాకల, తాటియాకులపాలెంల్లో సందర్శించారు. దళితుడిని కొట్టి, కులంపేరుతో దూషించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కొత్తపాకల గ్రామంలో దళితులు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలిపారు. 
    అనంతరం తాటియాకులపాలెంలో రైతులతో మాట్లాడారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా పోరాడుతామని స్పష్టం చేశారు. పోరాటంలో కేసులు సర్వసాధారణమని, అటువంటి వాటికి భయపడేదిలేదన్నారు. పరిశ్రమ వ్యతిరేకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, కొత్తపాకల గ్రామానికి చెందిన అప్పలరాజును కులంపేరుతో దూషించి కొట్టిన సీఐ చెన్నకేశవరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.
     
    సీఐపై చర్యలు తీసుకోవాలని దీక్షలు
    తొండంగి : పంపాదిపేటలో పోలీసులు లాఠీచార్జి సంఘటన సందర్భంగా కొత్తపాకల గ్రామానికి చెందిన దళితుడిని గాయపరిచి, కులంపేరుతో దూషించిన తుని రూరల్‌ సీఐ చెన్నకేశవరావుపై చర్యలు తీసుకోవాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బీఎన్‌ రాజు డిమాండ్‌ చేశారు. సోమవారం పంపాదిపేటలో జరిగిన సంఘటనలో కొత్తపాలకు చెందిన అప్పలరాజును కులంపేరుతో దూషించి, లాఠీతో కొట్టారని ఆరోపిస్తూ గ్రామస్తులు మంగళవారం నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షకు రాజు మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళితునిపై సీఐ దాడి చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై బుధవారం ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసి, దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు.
     
మరిన్ని వార్తలు