మానవతకు పాతర

15 Mar, 2017 02:12 IST|Sakshi
మానవతకు పాతర

మూడు రోజుల పురిటిగుడ్డును ప్రాణాలతో పాతిపెట్టే పాతకం
కన్నతండ్రి ప్రోద్బలంతో ఆస్పత్రి గార్డు అకృత్యం..
నెలలు నిండకుండా.. అవయవాలు వృద్ధి చెందకపోవడమే కారణమట
శ్మశానంలో ఆ ఘాతుకాన్ని గమనించి అడ్డుకున్న పలువురు
సెక్యూరిటీ గార్డుకు దేహశుద్ది.. పాప క్షేమంగా ఆస్పత్రికి..


నెలలు నిండకుండానే ఈ లోకంలోకి వచ్చేయడమే ఆ పురిటిగుడ్డు చేసిన పాపం.. అవయవాలు అంకురించకుండానే పుట్టిన ఆడబిడ్డ.. వైద్యానికే లక్షలు పోయాలన్న బెంగ.. ఆ తండ్రి హృదయాన్ని కఠిన పాషాణంగా మార్చేశాయి.. కన్నపేగు అన్న కనికరాన్ని కూడా దూరం చేశాయి.. పురిటి వాసన కూడా పోని పసికూనను ప్రాణాలతోనే పాతిపెట్టే పాతకానికి పురిగొల్పాయి.. బిడ్డకు జన్మనిచ్చిన ఆస్పత్రికి చెందిన సెక్యూరిటీ గార్డే తోడ్పాటునందించి.. మానవ విలువలకు.. పేగు బంధానికి పాతరేసే అకృత్యానికి తెగబడితే.. మరుభూమిలో ఆ దారుణాన్ని గుర్తించి.. గార్డును చితకబాది.. పసిగుడ్డు ప్రాణాలు పోకుండా కాపాడారు కొందరు మానవతామూర్తులు.. చివరికి చైల్డ్‌లైన్, చైల్డ్‌ ప్రొటెక్షన్, పోలీసు విభాగాలు స్పందించి.. పసికూనకు రక్షా కవచంగా నిలిచారు.

పెదవాల్తేరు (విశాఖ తూర్పు) :   పసికందు బతికుండగానే కడతేర్చాలనుకున్న కసాయితనం. నెలలు నిండకుండా పుట్టిందనే నెపంతో కాటికి తీసుకువెళ్లిన కూృరత్వం. గుక్కతిప్పకుండా కేరుమంటున్నా గుండె కరగని అమానుషత్వం.. ఆ నరరూప రాక్షసుడి పైశాచికత్వాన్ని వివరించడానికి ఎన్ని పదాలు చాలుతాయి? ఆ కర్కోటకుడి నిర్దాక్షిణ్యాన్ని చెప్పాలంటే ఏ భాషలో ఏ మాటలు సరిపోతాయి? అయితే ఏ దేవతలు పుణ్యం కట్టుకున్నారో.. అంత ముష్కరుడి చేతుల్లో పడి కూడా పసిపాప ప్రాణాలు నిలిచాయి. పట్టపగలు శ్మశానం నుంచి పసిపాప మృత్యుఘోష విన్న స్థానికులు వెంటనే స్పందించడంతో చిట్టితల్లికి పంచప్రాణాలు నిలిచాయి. జరుగుతున్న దారుణాన్ని తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయి కర్కోటకుడికి దేహశుద్ధి చేశారు. బొడ్డుతాడు ఊడని ఆ పసికందును రక్షించేందుకు పోలీసులకు సమాచారం అందించారు.

బాలల రక్షణ విభాగం ఆధ్వర్యంలో శిశువుకు వైద్యం
సమాచారం అందుకున్న మహిళా శిశు సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ చిన్నయిదేవి.. బాలల సంరక్షణ విభాగం ప్రతినిధి ఆనంద్‌ను సంఘటన స్థలానికి పంపించారు. ఆయన హుటాహుటిన శ్మశానానికి వెళ్లి పసికందును అక్కున చేర్చుకున్నారు. వెంటనే తదుపరి వైద్యం కోసం కృష్ణా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

కారా ప్రతినిధుల ఆగ్రహం
ఈ విషయం తెలిసి కారా (సెంట్రల్‌ ఎడ్పాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ) సభ్యుడు కంభంపాటి వాసుబాబు ఆస్పత్రికి వెళ్లి యాజమాన్యం, శిశువు తండ్రితో మాట్లాడాడు. శిశువు నెలలు నిండకుండా పుట్టిందని, దీంతో అవయవాలు సంపూర్ణంగా వృద్ధి చెందలేదని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొనగా, వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని చెప్పారని శిశువు తండ్రి తెలిపాడు. బతికున్న పసికందును ఎలా కప్పిపెడతారంటూ కారా సభ్యుడు వాసుబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి బిడ్డలు పుట్టినప్పడు వైద్యం చేయించే స్తోమత లేకపోతే బాలల రక్షణ విభాగానికి ఆశ్రయిస్తే నిధులు కేటాయిస్తారని చెప్పారు. అలా కాకుండా పసికందు ప్రాణాలు తీయడానికి పూనుకోవడం నేరమన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి యాజమాన్యంపైన, శిశువు తల్లిదండ్రులను, పూడ్చిపెట్టడానికి ప్రయత్నించి సెక్యూరిటీ గార్డుపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఆధ్వర్యంలో శిశువుకు వైద్యం
శిశువుకు వైద్యంతోపాటు సంరక్షణ బాధ్యతలను చైల్డ్‌ వెల్పేర్‌ కమిటీకి అప్పగించామని కారా సభ్యుడు వాసుబాబు పేర్కొన్నారు. వైద్యానికి కావాల్సిన నిధులు సమకూర్చుతామని తెలిపారు. శిశువుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శిశు గృహం సిబ్బంది సైతం బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు.

చైల్డ్‌రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం చొరవ ప్రశంసనీయం
పసికందును ప్రాణాలతో పూడ్చిపెడుతున్నారన్న విషయం తెలుసుకున్న చైల్డ్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరం కన్వీనర్‌ గొండు సీతారాం స్థానికులతో కలిసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి శిశువును సంరక్షించేందుకు విశ్వప్రయత్నం చేశారు. బిడ్డకు ఆసరాగా అధికారుల నిలబడేందుకు వీలుగా వారితో సంప్రదింపులు జరిపారు. దీంతోపాటు పసికందు విషయాన్ని అందించిన స్థానికులు మహాలక్ష్మి, రాజులను సైతం కారా ప్రతినిధులు అభినందించారు.

నెలలు నిండ లేదని...
నర్సీపట్నానికి చెందిన మామిడి గోవింద్‌ గర్భిణి అయిన తన భార్యను జిల్లా పరిషత్‌ జంక్షన్‌లో గల కృష్ణా ఆస్పత్రిలో చేర్పించాడు. మూడు రోజుల క్రితం ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ ఆరోగ్యం సవ్యంగాలేదు. దీంతో వైద్య పరీక్షలు చేశారు. నెలల నిండకుండా ఏడో నెలలో బిడ్డ పుట్టడంతో అవయవాలు పూర్తిగా వృద్ధి చెందలేదు. పసిబిడ్డ వైద్యానికి పెద్దమొత్తంలో ఖర్చవుతుందని ఆస్పత్రి వర్గాలు బిడ్డ తల్లిందండ్రులకు తెలిపారు. వారి మధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయో ఏమో కానీ బతికి ఉన్న ఆ బిడ్డను పెదజాలారిపేట శ్మశాన వాటికలో మంగళవారం సాయంత్రం పూడ్చేందుకు కృష్ణా ఆస్పత్రికి చెందిన సెక్యూరిటీ గార్డు గొయ్యి తవ్వతున్నాడు. అదే సమయంలో శ్మశాన వాటికలో దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్థానికులకు పసిబిడ్డ ఏడుపు వినిపించింది. అనుమానంతో స్థానికులు అక్కడి వెళ్లి చూసేసరికి హృదయ విదారక దృశ్యం వారి కంట పడింది.

చలించిపోయిన స్థానికులు బతికి ఉన్న పసికందును పూడ్చిపెట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని నిలదీశారు. అతడు సరిగా సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయారు. అతనికి దేహశుద్ధి చేశారు. దీంతో తాను కృష్ణా ఆస్పత్రి చెందిన సెక్యూరిటీ గార్డునని పేర్కొన్నాడు. స్థానికులు బాలల సంరక్షణ విభాగానికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించి పసిబిడ్డను రక్షించారు. ఈ విషయమై కృష్ణా ఆస్పత్రి నిర్వాహకుడు సీతారామరాజును ‘సాక్షి’ వివరణ అడగడానికి ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం
నెలల నిండని శిశువును పెదజాలారిపేట శ్మశానవాటికలో పూడ్చిపెట్టేందుకు యత్నిస్తున్న విషయాన్ని స్థానికుల సమాచారం మేరకు తెలుసుకున్నాం. అక్కడికి వెళ్లి ఆ బిడ్డను రక్షించి వెంటనే కృష్ణా ఆస్పత్రికి తరలించారు. అదే ఆస్పత్రిలో బిడ్డ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – సీఐ మళ్ల మహేష్‌

పోలీసుల అదుపులో సెక్యూరిటీ గార్డు

మరిన్ని వార్తలు