వీసీల నియామకాలను రాజకీయం చేయొద్దు

9 Feb, 2016 01:18 IST|Sakshi

- కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా చట్ట సవరణ సరికాదు: హైకోర్టు
- వీసీల నియామకాలన్నీ తుది తీర్పునకు లోబడి ఉంటాయి
- మధ్యంతర ఉత్తర్వులు జారీ.. తదుపరి విచారణ 23కు వాయిదా
 
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ల(వీసీ) నియామకాలను రాజకీయ నియామకాలుగా చేయడం ఎంత  మాత్రం సబబు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాన్ని అన్వయించుకుంటే దానికి శాసన వ్యవస్థ ద్వారా మాత్రమే సవరణలు చేయాలి తప్ప.. కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా కాదని పునరుద్ఘాటించింది. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో చేపట్టబోయే వైస్ చాన్స్‌లర్ల నియామకాలన్నీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ అంశాన్ని వీసీల నియామకపు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 
 తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 23న కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా చట్టసవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా? లేదా? అన్న విషయంపై తుది విచారణ చేపడుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో 29, జీవో 38ను సవాలు చేస్తూ రిటైర్డ్ ప్రొఫెసర్ డి.మనోహర్‌రావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. యూజీసీ పే స్కేళ్లను సవరించి వాటిని 2014 నుంచి వర్తింపచేసేందుకు జారీ చేసిన ఉత్తర్వులనూ సవాలుచేశారు. ఈ వ్యాజ్యాలను సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
 
 ఆర్డినెన్స్ తేవడంలో అర్థమేంటి?
 పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఏపీలోని చట్టాన్ని అన్వయింప చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఆ చట్టానికి ఉత్తర్వు ద్వారా సవరణ తెచ్చింద న్నారు. ఇప్పటివరకు యూనివర్సిటీలకు గవర్నర్ చాన్స్‌లర్‌గా ఉండే వారని, ఇప్పుడు దాన్ని సవరించిందని తెలిపారు. ఇందుకు అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ఇది కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా చట్ట సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన నాలుగో వ్యాజ్యమని చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తమకున్న అధికారం మేరకే వ్యవహరించామని వివరించారు. ఈ సందర్భంగా.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు విషయంలో మొదట జారీ చేసిన  జీవో 207ను రద్దు చేసి.. మరో ఆర్డినెన్స్ జారీ చేయడంలో అర్థమేమిటని ధర్మాసనం ప్రశ్నించింది.

మేయర్ ఎన్నికల సమయంలో ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ జీవో రద్దు చేసి ఆర్డినెన్స్ తెచ్చాం తప్ప మరే ఉద్దేశం లేదని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అలాగే దేశంలో చాలా వర్సిటీలకు చాన్స్‌లర్లుగా గవర్నర్లు లేరని చెప్పారు. కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా చట్ట సవరణ వివాదం పదేపదే తలెత్తుతోందని, అందువల్ల అన్ని వ్యాజ్యాలపై తుది విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ రోజున ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు ఆర్డినెన్స్‌ను తమ ముందుంచాలని ఏజీకి తేల్చి చెప్పింది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా