వైద్యుడి నిర్లక్ష్యంతో బాలుడు మృతి

29 Aug, 2016 23:45 IST|Sakshi
మృతిచెందిన ధనుష్‌రెడ్డి
  • ఆరోపిస్తూ కుటుంబ సభ్యుల ఆందోళన
  • ఇల్లెందు : వైద్యుడి నిర్లక్ష్యంతో ఓ బాలుడు మృతిచెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని స్టేషన్‌ బస్తీకి చెందిన భూపాల్‌రెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడు ధనుష్‌రెడ్డి(7) సోమవారం ఉదయం బయట ఆడుకొని ఇంట్లోకి వచ్చాడు. కొద్దిసేపటికే నోట్లో నుంచి నురగలు వస్తుండటంతో వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యుడు లేకపోవడంతో సిబ్బంది చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బాలుడు మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఎదుట రాస్తారోకో చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన విరమింపజేశారు. కౌన్సిలర్‌ రవినాయక్, మానవ హక్కుల సంఘం నేత మల్లికార్జున్, సీపీఎం నాయకుడు నబీ ఆందోళనకు మద్దతు పలికారు. కాగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడిపై చర్య తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
    డాక్టర్‌ సతీష్‌ వివరణ  : బాలుడిని ఆస్పత్రికి తీసుకొచ్చిన సమాచారం అందిన వెంటనే తాను ఆస్పత్రికి వచ్చేలోపే బాలుడిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఫిట్స్‌ వచ్చిందని ఆస్పత్రికి సిబ్బంది తనకు ఫోన్‌లో చెప్పిన వెంటనే మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించాలని సిబ్బందికి చెప్పాను. బాలుడి మృతి పట్ల తమ నిర్లక్ష్యం ఏమీ లేదు.
     

మరిన్ని వార్తలు