వైద్యం చేయమంటే రాజీనామా చేసిన డాక్టర్‌

26 Aug, 2016 22:38 IST|Sakshi
వైద్యం చేయమంటే రాజీనామా చేసిన డాక్టర్‌
  •  నిండు గర్భిణికి వైద్యం చేసే విషయంలో నిర్లక్ష్యం
  •  మాచర్ల (గుంటూరు): నిండు గర్భిణికి వైద్యం చేయమని అడిగినందుకు ఏకంగా ఓ  వైద్యురాలు రాజీనామా చేసి వెళ్లిపోయిన ఘటన మాచర్ల పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా దుర్గి మండలంలోని కోలగొట్ల గ్రామానికి చెందిన చాట్ల సాగరమ్మ పురిటి నొప్పులతో బాధపడుతుంటే తెల్లవారుజామున 5 గంటలకు ప్రైవేటు ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తెచ్చారు. ఆ సమయంలో హాస్పటల్‌లో నర్సులు తప్ప వైద్యులు లేరు. ఆమెకు నర్సులే వైద్య పరీక్షలు చేశారు. ఉదయం 8.30 గంటల వరకు వైద్యులు రాలేదు. తీవ్రమైన నొప్పులతో ఆమె బాధపడుతున్నా మెరుగైన వైద్యం చేసే డాక్టర్లు అందుబాటులో లేరు. విషయాన్ని నర్సులు సీమాంక్‌ సెంటర్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ కొమ్మారెడ్డి రోహిణికి సమాచారం ఇచ్చారు. ఆమె ఆస్పత్రికి రాగానే గర్భిణి బంధువులు ప్రశ్నించారు. ఉదయం 5 గంటలకు నొప్పులతో బాధితురాలిని ఆస్పత్రికి తీసుకొస్తే ఇప్పటివరకు వైద్యం చేయకపోవడం ఏమిటని, తక్షణమే వైద్యం చేయాలని కోరారు. తాను బాధ్యతల నుంచి వైదొలుగుతున్నానని, ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానంటూ చెప్పి గర్భిణికి వైద్యం చేయకుండానే డాక్టర్‌ రోహిణి వెళ్లిపోయారు.  సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శిరీషాను వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించాల్సిందిగా బంధువులు కోరగా తాను చిన్న పిల్లల డాక్టర్‌ను మాత్రమేనని సీమాంక్‌ సెంటర్‌ వైద్యురాలైన డాక్టర్‌ రోహిణి రాజీనామా చేశారని తెలిపారు. బాధితురాలైన సాగరమ్మను తక్షణమే గుంటూరుకు తీసుకెళ్లాలని రిఫర్‌ చేశారు. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిన గర్భిణికి చికిత్స చేయకపోవడంతో ఆగ్రహించిన బంధువులు, బహుజన సమాజ్‌వాదీ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. నిరుపేదలైన వారు గర్భిణిని గుంటూరు తీసుకెళ్లేందుకు డబ్బులు లేక అవస్థలు ఎదుర్కొన్నారు. ఇక్కడే వైద్యం అందించాలని కోరినా తీసుకెళ్లాల్సిందేనని చెప్పడంతో వారు నానా తంటాలు పడతూ చివరకు సాగరమ్మను గుంటూరు తరలించారు.
     
మరిన్ని వార్తలు