మానవత్వం మరచిన వైద్యులు

21 Aug, 2016 01:53 IST|Sakshi
మానవత్వం మరచిన వైద్యులు
 
  •  అనారోగ్యతో ఆస్పత్రికి వస్తే చికిత్స చేసేందుకు నిరాకరణ
నెల్లూరు(క్రైమ్‌) : ఊపిరి ఆడటం లేదంటూ ఓ మహిళ వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లింది. తక్షణమే వైద్యసేవలందించాల్సిన అక్కడి వైద్యసిబ్బంది నిరాకరించారు. ప్రాణాలు పోతున్నాయని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. ఈ పరిస్థితి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శనివారం జరిగింది. నెల్లూరు రూరల్‌ మండలం గుడిపల్లిపాడుకు చెందిన ఓ వివాహిత కొంతకాలం  కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెకు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు చేయించారు. ఆమెకు నయంకాని జబ్బని పరీక్షల్లో తేలింది. జబ్బును నయం చేసేందుకు మందులు ఇచ్చి వాటిని క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. మందులను వాడుతున్నా.. జబ్బునయం కాలేదు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించసాగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువస్తే వారు సరిగా వైద్యసేవలు అందించలేదు. దీంతో  ఆమెను జొన్నవాడలోని కామక్షితాయి దేవాలయం వద్ద వదిలి పెట్టారు. శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమె స్థానికుల సహాయంతో చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. అప్పటికే ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. తన పరిస్థితిని అక్కడున్న వైద్యులు, వైద్య సిబ్బందికి చెప్పలేక చెప్పి చికిత్స అందించాలని అభ్యర్థించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటం చూసి వైద్యం అందించేందుకు వారు నిరాకరించారు. తన దయనీయస్థితిని అటుగా వెళ్లేవారికి చెప్పి వైద్యం అందించేందుకు సహకరించాలని కన్నీటి అభ్యర్థించింది. కొందరు సహచర రోగులు ఆమె పరిస్థితిని అక్కడున్న వైద్యసిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించిన పాపన పోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆస్పత్రి ఆవరణలోనే వైద్యంకోసం పడిగాపులు కాయసాగింది. తాజా ఘటన మరోసారి ప్రభుత్వ వైద్యసిబ్బందిలో మానవత్వం మచ్చుకైనా లేదన్న విషయాన్ని మరోసారి రుజువుచేస్తోందని పలువురు రోగుల బందువులు వాపోతున్నారు. 
మరిన్ని వార్తలు