శునకాలు కావు... అంతకు మించి!

20 Mar, 2016 03:20 IST|Sakshi
శునకాలు కావు... అంతకు మించి!

విశ్వాసం వాటి గుణం, సాహసం వాటి నైజం, క్రమశిక్షణ వాటికి అలంకారం... నేర నిరూపణ ప్రక్రియలో నిత్యం పోలీసుల వెన్నంటి ఉండి దొంగల పాలిట సింహ స్వప్నాలవి. యూనిఫాం వేసుకోని ఈ రక్షక శునకాల గురించి...

వాటికి మాటలు రాకపోవచ్చు... కానీ ‘సావధన్’ అని గట్టిగా వినిపిస్తే చాలు రెండు కాళ్లపై నించుని సంసిద్ధమయ్యే సంస్కారం వాటి సొంతం. వాటికి మనంత ఆలోచన లేకపోవచ్చు... ఖాకీ చొక్కా వెనుక పరిగెత్తి చనిపోయేందుకు కూడా సిద్ధపడే తెగువ వాటికే సొంతం. ఆయుధాలు వాడడం తెలియకపోవచ్చు... దొంగల నుంచి బాంబుల వరకు ఏదైనా సరే పసిగట్టేందుకు వెనుకాడని తత్వం వాటికి మాత్రమే సొంతం. అవినీతి మకిలి అంటని పోలీసుల సరసన వాటికీ చోటు ఉంటుంది. దేశం కోసం ఊపిరి వదిలిన వీరుల సరసన ఆ దళానికీ గౌరవం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి పోలీసు అధికారీ ఒప్పుకుంటారు. ఎందుకంటే శాఖలోని శునకాలు అంటే కేవలం జంతువులు కాదు. అంతకు మించి...    - ఎచ్చెర్ల

 ఇదే మన దళం...
టైగర్, రాణి, డాన్, లిమో, ఝూన్సీ... మన పోలీసులకు నేర నిరూపణ ప్రక్రియలో సాయపడుతున్న శునకాల పేర్లు. పేర్ల లాగానే వీటి సంరక్షణ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇవి హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన లే బ్రా, డాబన్‌మెన్ జాతి కుక్కలు. వీటిలో ఝూన్సీ నేర విభాగంలో పనిచేస్తుంది. క్లూస్ టీమ్‌లో కీలకంగా సేవలు అందిస్తుంది. దొంగతనాలు జరిగేటప్పుడు, హత్యలు, అల్లర్లు, ఇతర తీవ్ర నేరాలు జరిగేటప్పుడు నిందితులు గాలింపుల్లో పోలీసులకు సాయపడుతుంది. మిగతా నాలుగు డాగ్‌లు బాంబులు స్క్వాడ్‌తో పని చేస్తాయి. వీటికి బాంబులు నిర్వీర్యం చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీఐపీలు సదస్సులు జరిగేటప్పుడు సభావేదికలు, ఇతర ప్రాంతాలు, వంతెనలు, కల్వర్టులు, బాంబు బెదిరింపు ఉన్న ప్రారంతాల్లో తనిఖీల్లో ఈ డాగ్ స్క్వా డ్స్ కీలకం.

శిక్షణ+క్రమశిక్షణ
ఎచ్చెర్ల ఆర్మ్‌డ్ రిజర్వు కార్యాలయంలో వీటి కోసం ప్రత్యేకంగా ఒక బ్లాక్ నిర్వహిస్తున్నారు. నిష్ణాతులైన పోలీసులు వీటికి రోజూ శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో డాగ్‌లు మర్యాదగా నడుచుకోవటం, ఎదుటి వారిని గౌరవించటం, కూర్చోవటం, నిల్చోవటం, ఫైర్ జంప్, హడిల్ జంప్, గోడలు గెంతటం వంటి అంశాలపై తర్పీదునిస్తారు. ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులు సూరపునాయుడు, సురేష్, వీవీ రమణ, సీహెచ్ ప్రసాద్, ఆదినారాయణ ఈ డాగ్‌లకు నిత్యం శిక్షణ  ఇస్తారు. వీరి శిక్షణ శునకాలు చూపే క్రమశిక్షణలో స్పష్టంగా తెలుస్తుంది. ఏటా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం స్థాయిలో రేంజ్ మీట్ నిర్వహిస్తారు. అందులో మూడు జిల్లాలు డాగ్‌ల పనితీరు సమీక్షిస్తారు. వెనుక బడ్డ డాగ్‌లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

ఎనిమిదేళ్లు గ్యారెంటీ
శునకాలు రక్షణ శాఖలో కనీసం ఎనిమిదేళ్లు చురుగ్గా సేవలు అందిస్తాయి. ఈ లోపుగా కొత్త బృందాలను తయారు చేస్తూ ఉంటారు. వీటికి బీమా కూడా చేయిస్తారు. బీమా కంపెనీలు ఎనిమిదేళ్లు పాలసీలు ఇస్తాయి.

 ఆహారమూ ప్రత్యేకమే...
వీటికి ప్రత్యేక ఆహారం ఇస్తారు. ఒక కుక్కకు నెలకు రూ. 5800 ఆహారం కోసం ఖర్చు చేస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన యాక్సీ ఆడాల్ట్, రోయల్ కెనాల్ కంపెనీలకు చెందిన ఆహారం ఇస్తారు. ఈ ఆహారం ద్వారా కుక్కలకు సరిపడే విటమిన్స్, ప్రొటీన్స్ లభిస్తాయి.

మరిన్ని వార్తలు