టీడీపీలో కుమ్ములాటలు

19 May, 2017 02:13 IST|Sakshi
టీడీపీలో కుమ్ములాటలు

ప్రతి సెగ్మెంట్‌లోనూ   గ్రూపులే
నేతల నడుమ పెరిగిన  ఆధిపత్య పోరు
నామినేటెడ్‌ పదవుల విషయంలో అసంతృప్తి
సరైన ప్రాధాన్యం లేదని పార్టీ సీనియర్ల గగ్గోలు


తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు పెరిగాయి. నాయకుల మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. గ్రూపులుగా విడిపోయి గొడవలు పడుతూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. క్రమశిక్షణకు పార్టీ మారుపేరంటున్న జిల్లా నేతలు జరుగుతున్న గొడవలను ఆపలేక నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీల్లో పెరిగిన వర్గ పోరు పతాక స్థాయికి చేరింది. నేతల మధ్య కొరవడ్డ సఖ్యత, పెరిగిన స్పర్థలపై ఆరా తీసిన సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల వెలగపూడిలో జరిగిన జిల్లా పార్టీ సమన్వయ కమిటీ
సమావేశంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.


తిరుపతి : జిల్లాలో టీడీపీ శ్రేణులను బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలన్న పార్టీ అధిష్టానం ఆశలపై జిల్లా నాయకులు నీళ్లు చల్లుతున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ నాయకులు గ్రూపులుగా విడిపోయారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో జరుగుతున్న జాప్యం నాయకుల్లో అసంతృప్తికి దారితీస్తోంది. ఒక వైపు తిరుపతి తుడా, టీటీడీ పాలక మండలి, ఇతరత్రా కార్పొరేషన్లపై ఆశలు పెట్టుకున్న ఎంతో మంది జిల్లా నాయకులు పదవుల కోసం ఎదురు చూసి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. మంత్రి పదవిని ఆశించిన ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు, తంబళ్లపల్లి, సత్యవేడు ఎమ్మెల్యేలు శంకర్, తలారి ఆదిత్యలు పార్టీ వ్యవహారాల్లో  ఆసక్తిగా పాల్గొనడం లేదు.

ఇకపోతే మంత్రి పదవి పోగొట్టుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా పార్టీపై అసంతృప్తితోనే ఉన్నారు. జిల్లాలోని బలమైన సామాజిక వర్గాన్ని కూడదీసుకోవాలన్న ఆలోచనతో సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అమరనాథరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టడం పార్టీలోని సీనియర్లకు కష్టం కలిగించింది. తొలినుంచీ పార్టీ జెండా మోస్తూ కష్టకాలంలో పార్టీని వెన్నంటి ఉన్న కార్యకర్తలు, నాయకులకు పదవులు దక్కడం లేదని వీరు మండిపడుతున్నారు.

నేడు అధినేతకు వివరించే యోచన
జిల్లా పార్టీ నాయకుల మధ్య నెలకొన్న స్పర్థలను తొలగించి అన్ని సెగ్మెంట్లలోనూ పార్టీని బలోపేతం చేయాలన్నదే సీఎం ఉద్దేశం. శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబునాయుడు ఈ విషయంపై జిల్లా నేతలతో చర్చించనున్నారని సమాచారం.


పెరిగిన ఆధిపత్య పోరు
పార్టీలో పదవులు, పలుకుబడి కోసం పరితపించే నాయకుల మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. స్పర్థలు బలపడి గొడవలకు కారణమవుతున్నాయి. ఇటీవల చంద్రగిరి, తిరుపతి,  మదనపల్లి సంస్థాగత ఎన్నికల్లో నాయకుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు