ఇదేమి పెత్తనం

15 Jun, 2017 13:28 IST|Sakshi
ఇదేమి పెత్తనం
  • ఎంపీ నిధులతో చేపట్టే పనులకు కోడలు ప్రారంభోత్సవాలు 
  • అధికారిక కార్యక్రమాల్లో ఆమెదే హవా
  • విస్తుబోతున్న అనుచరగణం
  • ప్రేక్షకపాత్రలో అధికారులు.
  •  
    రాజకీయాల్లో అతివల అధికారాన్ని చేజిక్కించుకొని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి మూలన కూర్చోబెట్టిన మగ మహారాజులున్నారు... పెత్తనం చెలాయిస్తూ వారికి కేటాయించిన అధికార సీట్లపై కూర్చొని అధికారాన్ని వెలగబెట్టినవారున్నారు. మండల సమావేశాల్లో జెడ్పీటీసీలకు, సర్పంచులకు బదులుగా భర్తలు, లేదా వీరి బంధువుల గళాలే వినిపిస్తాయి. సంబంధితాధికారులు కూడా కిమ్మనకుండా చర్చల్లో పాల్గొంటున్నారు. చివరకు జిల్లా కేంద్రంలోని ఓ మహిళా శాసన సభ్యురాలు కూడా స్వతంత్రంగా వ్యవహరించలేని దుస్థితిలో ఉండడం విచారకరం. ఇందుకు భిన్నంగా ఉంది సినీ నటుడు, ఎంపీ మురళీమోహన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలోని పరిణామాలు. 
     
    సాక్షి ప్రతినిధి, కాకినాడ :  రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ మురళీమోహన్‌కు బదులు కోడలు రాజ్యమేలుతున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఎంపీ మురళీమోహన్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన ఉన్నా లేకున్నా అన్నింటా తానే అన్నట్టు కోడలు చక్రం తిప్పుతూ పెత్తనం చెలాయిస్తూ రావడం ఆయన అనుచరులతోపాటు అధికారులకు ఇబ్బందుల్లో నెడుతున్నా అడ్డు చెప్పకుండా మౌనం వహిస్తున్నారు. మురళీమోహన్‌ ఎంపీ అయ్యాక కోడలు రూపాదేవి కూడా నీడలా ఆయన వెంటే నడుస్తున్నారు. ప్రధానంగా అనపర్తి నియోజకవర్గం వచ్చే ప్రతిసారీ ఈమె లేకుండా ఆయన రావడం లేదు.

    మురళీమోహన్‌ వయస్సు రీత్యా చేదోడువాదోడుగా ఉండేందుకు వస్తున్నారని ఇంతకాలం పార్టీ శ్రేణులు సరిపెట్టుకుంటూ వస్తున్నాయి.  మురళీమోహన్‌ ఏమనుకుంటారేమోననే మొహమాటంతో ఆయనతోపాటు కార్యక్రమాల్లో వేదికపైకి కోడల్ని కూడా అనివార్యంగా ఆహ్వానిస్తున్నారు. అది పార్టీ కార్యక్రమమైనా, అధికారిక కార్యక్రమమైనా సరే. మామ వెంట కోడలు రావడంలో తప్పేంటని సమర్థిస్తూ వచ్చిన వారు కూడా రంగాపురం గ్రామంలో సోమవారం (12వ తేదీన) ఆమె చేసిన ప్రారంభోత్సవాలతో ఒక్కసారిగా విస్తుపోయారు..
     
    మురళీమోహన్‌ ఎంపీగా ఎన్నికయ్యాక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా ఓటమి తరువాత అందుకు ప్రధాన కారణమైన అనపర్తి నియోజకవర్గంపై మురళీమోహన్‌ వల్లమాలిన అభిమానాన్ని పెంచుకున్నారు. 2014లో ఎన్నికలు వచ్చే వరకు కాళ్లకు బల్పాలు కట్టుకుని ఈ నియోజకవర్గంలో మురళీమోహన్‌ తిరిగినన్నిసార్లు మరే నాయకుడూ తిరిగి ఉండరు. తన గెలుపులో అనపర్తి నియోజకవర్గ పాత్రను మరిచిపోలేనని, అందుకే నియోజకవర్గంలో బిక్కవోలు మండలం రంగాపురం గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని హామీ కూడా ఇచ్చారు.

    అలా దత్తత తీసుకుని రెండున్నరేళ్లవుతున్నా ఎంపీ పర్యటించిది వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో కోడలు ఆకస్మికంగా  ఈ నెల 12వ తేదీన  (సోమవారం) రూ.12 లక్షల వ్యయంతో ఎంపీ నిధులతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాలును ప్రారంభించి, రూ.7 లక్షలు ఎన్‌ఆర్‌జీఎస్, పంచాయతీ నిధుల భాగస్వామ్యంతో బీసీ కాలనీ రోడ్డు పనులకు రూపాదేవి కొబ్బరికాయ కొట్టి భూమి పూజచేశారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మరో అడుగు ముందుకేసి పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశ వేదికపైకి రూపాదేవిని తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జిగా పరిచయం చేసి మాట్లాడాల్సిందిగా కోరడం విశేషం.

    నియోజకవర్గ ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి రూ.19 లక్షలతో పంచాయతీ భవనం, రూ.9.50 లక్షలతో అంగన్‌వాడీ భవనం, రూ.4 లక్షలతో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. అదే సమయంలో రూపాదేవి రంగాపురంలో ప్రారంభోత్సవాలు ఏ హోదాతో చేశారని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఎంపీగా గ్రామాన్ని దత్తత తీసుకున్నంత మాత్రాన కోడలు ప్రారంభోత్సవాలు చేయడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంపీ నిధులు తమ సొంత జేబులోంచి తీసి ఖర్చు చేస్తున్నట్టుగా భావిస్తున్నట్టున్నారని విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసేలా అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని మేధావి వర్గం ఆక్షేపిస్తోంది.
    .
      
మరిన్ని వార్తలు