డాన్‌

11 Nov, 2016 01:10 IST|Sakshi
నువ్వా..నేనా!
 
వార్‌ మొదలైంది
– వ్యాపార లావాదేవీల్లో విభేదాలు 
– వారం రోజుల క్రితం పరస్పర దాడులు 
– ఒకరినొకరు చంపుకునే స్థాయిలో గొడవలుఽఽ
– పోటాపోటీగా కర్నూలులో మట్కా, పేకాట విస్తరణ 
– బుధవారపేట డాన్‌కు అధికార పార్టీ నేత అండదండలు 
– అటువైపు కన్నెత్తి చూడని పోలీసులు
- కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ఎస్‌ఐ కుమారుడు
 
కర్నూలు:
మట్కా డాన్‌ల మధ్య మళ్లీ వార్‌ మొదలయింది. లావాదేవీల్లో విభేదాలు తలెత్తడంతో ఒకరిపై ఒకరు ఏకంగా వారం రోజుల క్రితం దాడులు కూడా చేసుకున్నారు. ఇద్దరి మధ్య పోటీలో ఒక ఎస్‌ఐ కుమారుడిపై చెప్పుల దాడి జరిగింది. గతంలో కుదిర్చిన రాజీ కాస్తా తాజా ఘటనతో బెడిసికొట్టింది. గత వారం రోజులుగా ఎవరికి వారుగా లావాదేవీలు నిర్వహించుకుంటున్నారు. అయితే, అటు పాత బస్తీ డాన్, ఇటు బుధవారపేట డాన్‌ల మధ్య నెలకొన్న ఈ తాజా వైరం ఒకరినొకరు అంతమొందించుకునే దాకా వెళుతోందనే ఆందోళన వారి అనుచరుల్లో వ్యక్తమవుతోంది.
 
ఇదీ గొడవకు కారణం
వాస్తవానికి ఒకప్పుడు ఈ ఇద్దరు డాన్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాతబస్తీ బ్రదర్స్, బుధవారపేట మట్కా డాన్‌ల మధ్య రాజీ కుదిరింది. ఇంకేముంది.. మట్కాతో పాటు పేకాట కూడా ప్రారంభించారు. వ్యాపారంలో మరొకరిని పోటీకి రాకుండా మూడేళ్లుగా లక్షల్లో ఆర్జించారు. లావాదేవీల్లో విభేదాలు తలెత్తి వారం రోజుల క్రితం ఇరువర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇద్దరికీ ప్రధాన అనుచరుడుగా వ్యవహరిస్తున్న నగరంలోని ఓ ఎస్‌ఐ కుమారుడిని బుధవారపేట డాన్‌ అనుచరులు చెప్పుతో కొట్టి తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. పేకాట వద్ద గొడవ జరగ్గా నాగన్న అనే వ్యక్తి తాను బుధవారపేటకు చెందిన డాన్‌ అనుచరుడినంటూ దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారని సమాచారం. అయితే, పాతబస్తీ బ్రదర్స్‌ నాగన్నను బయటకు తోసేశారు. ఈ నేపథ్యంలో బుధవారపేట డాన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు 20 మంది పెద్దపార్కుకు ఎదురుగా ఉన్న ఒక దుకాణంలోకి వెళ్లి పాతబస్తీ బ్రదర్స్‌పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని ఎవరికి వారుగా గత వారం రోజుల నుంచి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
 
మట్కాతో పాటు పేకాటకూ సై
గతంలో కేవలం మట్కానే నిర్వహించే ఇరువురు డాన్‌లు తాజాగా పేకాట కేంద్రాలను కూడా విస్తరించారు. బుధవారపేట డాన్‌ తన ఇంటితో పాటు సమీపంలోని గోడౌన్, పాతబస్తీకి వెళ్లే రహదారిలోని మసీదు సందులో ఉన్న ఓ ఇంట్లో పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇందుకు పోలీసుల సహకారం మెండుగా ఉంది. రోజు మార్చి రోజు స్థావరాలు మారుస్తూ పేకాట సాగుతోంది. అటువైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు పోలీసులకు భారీగా మామూళ్లు ముడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌ కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతోంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే కేంద్రాన్ని మార్చాలంటూ పోలీసుల నుంచి హెచ్చరికలు వెళ్లగానే అటునుంచి జూదర్లు మాయమవుతుంటారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల, రాయచూరు, కడప, కర్నూలుతో పాటు గుంతకల్లు, అనంతపురం ప్రాంతాల నుంచి వ్యాపారులు, రియల్‌ ఎస్టేట్‌ నిర్వాహకులు ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతుంటారు.
 
గతంలో డీజీపీకి ఫిర్యాదు
ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి హయాంలో కూడా పెద్ద ఎత్తున పేకాట జరుగుతున్నట్లు బాధితుడొకరు నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసులు దాడి చేసి మట్కా డాన్‌తో పాటు అనుచరులందరినీ అరెస్టు చేసి కటకటాలకు పంపారు. దాదాపు కోటిన్నరకు పైగా డబ్బును పోలీసులు అప్పట్లో స్వాధీనం చేసుకోవడం ఇప్పటికీ పోలీసు శాఖలో చర్చనీయాంశం. కొంతకాలం పేకాట కేంద్రాలను మూసివేసి తర్వాత ఇరువురూ రాజీ పడి మళ్లీ పేకాట కేంద్రాలను కొనసాగించారు. డబ్బుల వసూళ్లలో తేడాలు రావడంతో ఒకరినొకరు విభేదించుకుని సొంతంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించకపోతే శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశముంది.
 
కీలకంగా ఎస్‌ఐ కుమారుడు
పాతబస్తీ బ్రదర్స్‌ తరపున రుక్మానందరెడ్డి, బుధవారపేట డాన్‌ తరపున సంపత్‌ అనే వ్యక్తులు పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్నారు. నగరంలోని ముఖ్యమైన స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఎస్‌ఐ కుమారుడు పేకాటరాయుళ్లకు అప్పులు ఇచ్చి భారీ మొత్తంలో వడ్డీతో పాటు ‘డిక్కీ' వసూలు వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, రాత్రి 10 నుంచి 1 గంట వరకు ఆయా స్థావరాల్లో పేకాట జోరుగా సాగుతోంది. పాతబస్తీ బ్రదర్స్‌ విడిపోయి ప్రస్తుతం గార్గేయపురం గ్రామ శివారులోని శివరాంపురం వద్ద పేకాట కేంద్రాన్ని నడుపుతున్నట్లు సమాచారం.
 
మరిన్ని వార్తలు