‘విల్లు’ విరాళాలకు టీటీడీ వెసులుబాటు

15 Feb, 2017 22:24 IST|Sakshi
‘విల్లు’ విరాళాలకు టీటీడీ వెసులుబాటు

నిబంధనలు సడలించిన టీటీడీ
ఆస్తి విరాళం ఇచ్చినా.. మరణానంతరం స్వీకరణ
పెరిగిన టీటీడీ ఖర్చులు.. కొనుగోళ్లు


తిరుమల: వెంకన్నకు విరాళాలు వెల్లువలా వచ్చి చేరుతున్నాయి. భక్తులు నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తుల రూపంలో కానుకలు సమర్పిస్తున్నారు. అదే స్థాయిలో విజ్ఞప్తులు కూడా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే టీటీడీ కూడా విరాళాల సేకరణలో కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఒకవ్యక్తి తన ఆస్తిని విల్లు రాసి టీటీడీకి రిజిస్ట్రేషన్‌ చేసినప్పటికీ తన జీవిత కాలం వరకు అనుభవించుకుని, మరణానంతరం ఆస్తిని దేవస్థానం స్వీకరించేలా నిబంధనలు సడలించారు. ఆమేరకు తిరుపతికి చెందిన ఏ.బసవ పున్నయ్యకు మూడంతస్తుల భవనం ఉంది. అందులో ఒక అంతస్తులతో తాను నివాసం ఉంటున్నారు. మరో రెండు అంతస్తులు అద్దెకు ఇచ్చి, ఆ మొత్తంతో జీవితం సాగిస్తున్నారు. ఆ భవనాన్ని ఇటీవల టీటీడీకి విరాళంగా సమర్పించారు. విల్లులో తన మరణాననంతరం స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆమేరకు టీటీడీ విరాళాలు స్వీకరించే నిబంధనలపై ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు సంబంధిత అధికారులతో సమీక్షించారు. కొన్ని నిబంధనలు సడలించి కానుకగా టీటీడీకి ఇచ్చిన ఆస్తులు దాతలు జీవిత కాలం వరకు అనుభవించుకుని, వారి మరణం తర్వాత టీటీడీ స్వాధీనం చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో చాలామంది భక్తులు ముందుకు వస్తారని అంచనాకు వచ్చారు. దీంతో భక్తుడు బసవ పున్నయ్య ఆస్తి స్వీకరణకు నిబంధనలు సడలింపు ఇస్తూ మంగళవారం ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించింది.

అసంపూర్తి అతిథిగృహం ఆధునికీకరణకు ఆమోదం
తిరుమలలో సన్నిధానం అతిథిగృహం సమీపంలోని మలేషియాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు వీఎం చంద్రకు 2002 అతిథిగృహం నిర్మాణం కోసం టీటీడీ స్థలం కేటాయించింది. అయితే, అది అసంపూర్తిగానే మిగిలిపోయింది. దీనిపై దాతకు టీటీడీ నోటీసులు ఇచ్చినా ఎటువంటి సమాధానం లేదు. దీంతో అసంపూర్తిగా ఉన్న ఆ అతిథిగృహాన్ని టీటీడీనే ఆధునికీకరించాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది. ప్రస్తుతం రూ.53 లక్షలతో ఆధునికీకరించాలని నిర్ణయించింది. దీనివల్ల యేటా రూ.1.5 కోట్ల వరకు టీటీడీకి ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

టీటీడీలో పెరుగుతున్న ఖర్చులు
టీటీడీలో యేటా ఖర్చులు పెరుగుతున్నాయి. ఇందులో నిర్వహణ ఖర్చులతోపాటు కొనుగోళ్లపై భారీగా ఖర్చు చేస్తోంది. గత ఏడాది కొనుగోళ్లకు రూ.362.60 కోట్లు ఖర్చు చేయగా, ఈసారి రూ.472.35 కోట్లు ఖర్చు చూపారు. ఫలితంగా కార్పస్‌ఫండ్‌ పెట్టుబడులు  2016–17లో మొత్తం రూ.757 కోట్లు  ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.475 కోట్లకు తగ్గాయి. ఇక 2017–2018 సంవత్సరానికి శాశ్వత  ఉద్యోగుల జీత భత్యాలకు రూ.575 కోట్లు, ఔట్‌సోర్స్‌ కార్మికులకు రూ.200 కోట్లు, ఇంజినీరింగ్‌ పనులకు రూ.200 కోట్లు కేటాయించారు. 

మరిన్ని వార్తలు