25 మిల్లీలీటర్ల గాడిద పాలు రూ.100

22 Aug, 2015 13:53 IST|Sakshi
25 మిల్లీలీటర్ల గాడిద పాలు రూ.100

కాకినాడ : ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అన్న పద్యాన్ని బహుశా తిరగరాయాలేమో! ఔషధ విలువలున్నాయన్న నమ్మకంతో కొంతమంది గాడిద పాలు కొనుగోలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వడ్డీ రాజుల కులస్తులు గాడిద పాలు విక్రయిస్తూ పొట్ట పోసుకుంటున్నారు. వారు శుక్రవారం కోరుకొండలో మకాం వేశారు. 25 మిల్లీలీటర్ల గాడిద పాలను చిన్న సీసాలో పోసి రూ.100కు విక్రయిస్తున్నారు.
 
 ఇవి తాగితే ఉబ్బసం, నడుంనొప్పి, కడుపునొప్పి తదితర రోగాలు నయమవుతాయని గాడిదపాలు విక్రయిస్తున్న గణేష్, గంగారామ్, చంద్రమ్మలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఒక్కో గాడిద ఆరు నెలలపాటు రోజుకు పావులీటరు చొప్పున పాలు ఇస్తుందన్నారు. ఆ పాలు అమ్మగా వచ్చిన డబ్బులే తమ కుటుంబాల్లోని 20 మందికి జీవనాధారమని చెప్పారు. ప్రతి గ్రామంలో రెండేసి రోజులుంటామన్నారు. తమవద్ద సుమారు పది గాడిదలున్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు