నాణ్యత అడగొద్దు..!

6 Jul, 2017 23:51 IST|Sakshi
– మూడు నెలల్లో పనులు పూర్తి కావాలి
– బిల్లుల చెల్లింపులోనూ జాప్యం పనికిరాదు
– నంద్యాల పనులపై ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలు
 
కర్నూలు(అర్బన్‌): ‘‘ పనులు చేసేవారు మనవాళ్లే.. నాణ్యత విషయాన్ని పట్టించుకోవద్దు...అనుమతులు, నిబంధనలు అంటు కాలయాపన చేయవద్దు.. బిల్లుల చెల్లింపులో కూడా ఎవరినీ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు, చేసిన పనులకు చేపినట్టు బిల్లులు చెల్లించండి.’’ నంద్యాల అధికారులకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే వేల కోట్ల రూపాయల అంచనాలతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రోడ్లు, డ్రెయినేజీలు, మంచినీటి పైప్‌లైన్లు, ఇళ్లు తదితర ఇంజనీరింగ్‌ పనులతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకుపోయేందుకు టీడీపీ నేతలు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల 29వ తేదిన సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు అందిన మరుక్షణమే జిల్లా అధికార యంత్రాంగం రూ.298.21 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అంతకుముందే నంద్యాల పట్టణ ఓటర్లను నమ్మించేందుకు రూ.60 కోట్లతో రోడ్ల విస్తరణ, డ్రెయినేజీ పనులను ప్రారంభించారు. అలాగే రూ.960 కోట్లతో 13 వేల ఇళ్లను నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అయితే ఈ పనులు నేటిరీ ప్రారంభం కాలేదు. తాజాగా నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లకు ప్రభుత్వం రూ.44 కోట్లను విడుదల చేసింది. అమృత్‌ పథకం కింద వెలుగోడు నుంచి నంద్యాల వరకు మంచినీటి పైప్‌లైన్‌ పనులు రూ.80 కోట్లతో జరుగుతున్నాయి. పట్టణంలో కూడా ఇంటింటికి కుళాయి కనెక‌్షన్ల పనులు కూడా ఊపందుకున్నాయి. 
 
రాత్రి, పగలు పనులు.. 
నాణ్యత గురించి ఉన్నతాధికారుల నుంచి భరోసా లభించడంతో ఆయా పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల ఆశకు అంతు లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు ఇంజనీరింగ్‌ అధికారులు కూడా వీరితో చేతులు కలపడంతో రాత్రి, పగలు తేడా లేకుండా పనులు జరగడమే గాక, నాణ్యత కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. ‘ దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి ’ అనే సామెతగా ఆయా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా రోడ్లు, డ్రెయినేజి తదితర పనుల్లో నాణ్యత గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు ...
నంద్యాల నియోజకవర్గంలో చేపడుతున్న పనులకు సంబంధించి స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచిపోతున్నా..ఏనాడు నంద్యాల అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఉప ఎన్నికల నేపథ్యంలో వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తోందని బాహాటంగానే వారు విమర్శిస్తున్నారు. పట్టణంలోని మురికివాడల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని అనేక సందర్భాల్లో కోరుతున్నా..పట్టించుకోని నేతలు ఉప ఎన్నిక నేపథ్యంలో హడావుడి చేయడం విమర్శలకు తావిస్తోంది.
 
>
మరిన్ని వార్తలు