మా బతుకులు ఆగం చేయెుద్దు

3 Sep, 2016 21:17 IST|Sakshi
మా బతుకులు ఆగం చేయెుద్దు
  • గోడు వెల్లబోసుకున్న మేడిగట్ట రైతులు 
  • గ్రామస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే పుట్ట మధు
  • ఆదుకుంటామని భరోసా 
  • మంథని : ‘అయ్యా.. తెలంగాణకు నీళ్లిచ్చే మేడిగడ్డ ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు. మావి అత్యంత విలువైన నల్ల రేగడి భూములు. ఒక రైతు సగటున ఎకరాకు కోటి రూపాయలు సంపాదించుకుంటడు. ఇంత విలువైన భూములను కూడా ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ మా బతుకులను ఆగం చేయొద్దు. మమ్మల్ని బజారున పడేయకండి’ అని మేడిగడ్ట రైతులు ఎమ్మెల్యే పుట్ట మధు ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. మంథని గ్రామపంచాయతీ కార్యాలయంలో మేడిగడ్డ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులతో ఎమ్మెల్యే శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను వివరించారు. ఆధారం కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని కోరారు. ఎకరాకు రూ.20 లక్షలు పరిహారం, చదువుకున్న యువకులకు ఉపాధి, భూములు కోల్పోతున్న వారికి ఉపాధి కల్పించాలని విన్నవించారు. న్యాయం చేస్తారనే నమ్మకంతోనే భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడిగడ్డ గ్రామస్తులు తెలంగాణలోని లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చే గొప్ప వ్యక్తులని వారిని కచ్చితంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. భూములు కోల్పోయే రైతులకు పరిహారంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులతోపాటు ముఖ్యమంత్రి దృష్టికి  రైతుల సమస్యలను తీసుకెళ్లి ఆదుకుంటామని తెలిపారు. సమావేశంలో అంబట్‌పల్లి సర్పంచ్‌ మాధవరావు, మహదేవపూర్, మంథని మార్కెట్‌ కమిటీ చైర్మన్లు శ్రీనివాసరావు, ఆకుల కిరణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
    మేడిగడ్డ రైతులను భయపెట్టొద్దు 
    మేడిగడ్డ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న మంథని డివిజన్‌లోని మహదేవపూర్,కాటారం, కమాన్‌పూర్‌ మండలాల్లోని రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. మండలంలోని బొమ్మాపూర్, సూరారం గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేపట్టడాన్ని తాము తప్పుపట్టడం లేదన్నారు. ఈ నిర్మాణంతో వేల ఎకరాల భూములు ముంపుకు గురవుతాయని తెలిపారు. దళితులకు పంచేందుకు మహదేవపూర్‌ మండలం అంటబ్‌పల్లి గ్రామంలో ప్రభుత్వమే ఎకరానికి రూ.5.15 లక్షలు చెల్లించి భూమి కొనుగోలు చేసిందని తెలిపారు. అదే గ్రామంలో ముంపునకు గురయ్యే అసైన్డ్‌ భూమికి మాత్రం కేవలం రూ.3 లక్షలే ఇస్తామనడం అన్యాయమన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అందరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యువ రైతులను సర్వే అధికారులు, పోలీసులు భయపెడుతున్నారని ఆరోపించారు. మెదక్‌ జిల్లాకు నీటిని తరలించడానికే సీఎం కేసీఆర్‌ మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మేడిగడ్డ, సూరారం, కన్నేపల్లి, అన్నారం, సుందిళ్ల, దామెరకుంట, తదితర గ్రామాల రైతులు తమ విలువైన పంట భూములను కోల్పోనున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నీళ్లతో ఉత్తర తెలంగాణ  రైతుల కాళ్లు కడుగుతామని కేసీఆర్‌ చెప్పడం విడ్డూరంగ ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ కింద భూమి పోతుందనే బెంగతో ఆత్మహత్య చేసుకున్న సూరారం మహిళా రైతు చల్లా స్వరూప కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీధర్‌బాబు వెంట కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి, కాంగ్రెస్‌ నాయకులు గోమాస శ్రీనివాస్, విలాస్‌రావు, గుడాల కృష్ణమూర్తి, కామిడి శ్రీనివాసరెడ్డి, షకీల్, రాణీబాయి, వరప్రసాద్, ప్రభాకర్‌రెడ్డి, రవిచందర్, గోగుల మధు, కృష్ణమోహన్‌ ఉన్నారు. 
మరిన్ని వార్తలు