ఎవరినీ వదలొద్దు

1 Aug, 2016 23:12 IST|Sakshi
రామకృష్ణకాలనీ శివారులో ఇసుక డంప్‌లను ఖాళీ చేస్తూ లారీల్లో లోడింగ్‌ చేయిస్తున్న అధికారులు
  • ఇసుక డంప్‌లను వెలికితీయండి 
  • అక్రమ రవాణాను అరికట్టండి 
  • అధికారులు నిద్రపోయినట్లు ఉండొద్దు
  • నిత్యం దాడులు కొనసాగించాలి 
  • రూ.800కోట్ల ఆదాయమే లక్ష్యం
  • అధికారులకు మంత్రి ఆదేశం 
  • కొత్తపల్లి క్వారీని తనిఖీ చేసిన కేటీఆర్‌ 
  • తిమ్మాపూర్‌ : ‘‘జిల్లాలో పోలీస్, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులుండగా ఇసుక అక్రమ రవాణా ఎలా నడుస్తుంది? ఇసుక రవాణాదారులు భయంలేక ఎట్లున్నరు? అధికారులు నిద్రపోయినట్లు ఉండొద్దు. నిత్యం తనిఖీలు కొనసాగించి అక్రమ రవాణాను అరికట్టాలి. ఎవ్వరినీ వదిలిపెట్టొద్దు’’ అంటూ రాష్ట్ర మున్సిపల్, గనులశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లి ఇసుక క్వారీని ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్వారీ లోపలికి పోలీసు వాహనంలో వెళ్లిన ఆయన లోడింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ ఇసుక లారీ డ్రైవర్లతో మాట్లాడారు. వే బ్రిడ్జికి పోతున్నారా? వే బిల్లులేకుండా లారీలు నడుస్తున్నాయా? అని ప్రశ్నించగా... నడుస్తున్నాయని చెప్పారు. తాము నల్లగొండ జిల్లా నుంచి వచ్చామని పేర్కొన్నారు. టన్ను ఇసుక ఎంతకు అమ్ముతున్నారని మంత్రి అడుగగా.. మొన్నటి వరకు రూ.900కు అమ్మారని, ఇప్పుడు రూ.1200 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇక్కడికంటే ఏటూరునాగారం ఇసుకకు అధిక ధర పలుకుతోందని చెప్పారు. డీడీలు రెగ్యులర్‌గా వెళ్లడం లేదని చెప్పారు. క్వారీని పరిశీలించిన అనంతరం ఆయన పోలీసు వాహనంలోనే కొత్తపల్లిలో ఇసుక డంప్‌లను పరిశీలించారు. అదే సమయంలో ఆయన జీపులో ఉన్న టీఎస్‌ఎండీసీ ప్రాజెక్టు ఆఫీసర్‌ కె.లక్ష్మీనర్సింహారావు, ఎల్‌ఎండీ ఎస్సై జగదీష్‌తో మాట్లాడారు. క్వారీ వద్దకు పెట్రోలింగ్‌కు వస్తారా? అంటూ ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా ఎలా జరుగుతోందని అడుగగా.. ట్రాక్టర్లతో ఇసుకతో డంప్‌లు చేస్తున్నారని పీవో చెప్పారు. ఇసుక సీజ్‌తో ఎంత ఆదాయం వచ్చిందని మంత్రి అడిగారు. ఆదివారం ఒక్కరోజే రూ.10లక్షలు వచ్చిందని పీవో చెప్పారు. అక్రమాలను అరికడితే ఎంత ఆదాయం వస్తుందని ప్రశ్నించగా.. రూ.500కోట్లు రావచ్చని పీవో వివరించారు. రాష్ట్రంలో ఇసుక ద్వారా ఏడాదికి రూ.800కోట్ల ఆదాయం లక్ష్యమైతే ఏడాది రూ.375కోట్లు మాత్రమే వచ్చింది కదా అంటూ మంత్రి ప్రశ్నించగా.. నీరు రాకుండా ఉంటే ఈసారి రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో రూ.18కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రాగా ఇందులో రూ.1.40కోట్లు సీనరేజ్‌ వచ్చిందని పేర్కొన్నారు. ప్రైవేటు వాహనాలు ఎలా నడుస్తున్నాయని మంత్రి ప్రశ్నించగా.. ఖాజీపూర్‌లో ఇంటికో ట్రాక్టర్‌ ఉందని, ఇది జీవనోపాధి అయిందని పీవో చెప్పారు. వెంటనే మంత్రి కరీంనగర్‌ ఆర్డీవో చంద్రశేఖర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎస్పీకి ఫోన్‌ చేసి ఇసుక డంప్‌లు సీజ్‌ చేయాలని సూచించారు. ఉదయమే కలెక్టర్‌తో మాట్లాడి దాడులు కొనసాగించాలని సూచించినట్లు తెలిసింది. అనంతరం ఎల్‌ఎండీలో మంత్రి కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. రెండుమూడు రోజులుగా ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రిస్తామన్నారు. 

    డంప్‌లను తరలిస్తున్న అధికారులు 
    మండలంలో ఇసుక డంప్‌లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. శనివారం కరీంనగర్‌ ఆర్డీవో చంద్రశేఖర్, తిమ్మాపూర్‌ సీఐ వెంకటరమణ నేతృత్వంలో రెవెన్యూ, పోలీసు శాఖ ఉద్యోగులు ఏకకాలంలో దాడులు నిర్వహించి మండలంలోని తొమ్మిది గ్రామాల్లో 21 ఇసుక డంప్‌లను గుర్తించారు. ఈ ఇసుకను రెవెన్యూ, పోలీసు అధికారులు దగ్గరుండి రెండు రోజులుగా ఖాళీ చేయిస్తున్నారు. కొత్తపల్లి ఇసుక క్వారీకి వచ్చిన ఇసుక లారీలను ఇసుక డంప్‌ల వద్దకు తరలించి అక్కడ ఇసుకను లోడింగ్‌ చేస్తూ వే బిల్లులు జారీ చేస్తున్నారు. మండలంలోని రామకృష్ణకాలనీ పరిధిలోని సుభాష్‌నగర్‌ శివారు, చెర్లపల్లిలోని ఇసుక డంప్‌లను సోమవారం ఖాళీ చేయించారు. రెండు రోజుల్లో మండలంలో 64 లారీల ఇసుకను తరలించగా, మరో 50 లారీల మేరకు ఇసుక డంప్‌లు ఉంటాయని తహశీల్దార్‌ కోమల్‌రెడ్డి తెలిపారు. 
    కఠినంగా వ్యవహరించండి :ఎస్పీ జోయల్‌డేవిస్‌ 
    కరీంనగర్‌ క్రైం : ఇసుక అక్రమ రవాణాదారులపై కఠినంగా వ్యహరించాలని, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీ జోయల్‌డేవిస్‌ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌ మండలం ఖాజిపూర్‌ క్వారీతోపాటు ఎలగందుల గ్రామంలో నిల్వ చేసిన ఇసుక డంపులను మైనింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి ఎస్పీ సోమవారం పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేయడానికి వీళ్లేదనిన్నారు. చెక్‌పోస్టులను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు, అధికారులు రాకుండా ఇసుక డంప్‌ల వద్దకు రాకుండా అక్రమ రవాణాదారులు అడ్డుగా తవ్విన గుంతలను పరిశీలించారు. అక్రమార్కులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు సోమవారం మరో 150 లారీల ఇసుక డంపులను సీజ్‌ చేశారు. వీటిని కూడా ఒక చోటకు చేర్చి టీఎస్‌ఎండీసీ ద్వారా అమ్మకాలు చేయాలని అధికారులకు సూచించారు. ఎస్పీ వెంట కరీంనగర్‌ ఆర్డీవో చంద్రశేఖర్, సీఐ కృష్ణగౌడ్, మైనింగ్‌ అధికారులున్నారు. 
    రెండు రోజుల అదాయం రూ.16లక్షలు
    పోలీసులు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు సంయుక్తగా పట్టుకున్న సుమారు రెండు వందల లారీల ఇసుక డంపులను టీఎస్‌ఎండీసీ ద్వారా అమ్మగా, సుమారు రూ.16 లక్షలు వచ్చినట్లు తెలిసింది. మరో మూడు వందల లారీల ఇసుక డంపుల్లో ఉందని సమాచారం. వీటిని కూడా తరలించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా.. పలువురు ఇసుక అక్రమ రవాణాదారులు సోమవారం ఎలగందుల గ్రామంలో సమావేశమై... త్వరలో హైదరాబాద్‌ వెళ్లి మంత్రిని కలిసి దాడుల నుంచి మినహాయింపు కోరాలని నిర్ణయించినట్లు సమాచారం. కొంతమంది సోమవారం సాయంత్రమే హైదారాబాద్‌ తరలివెళ్లినట్లు తెలిసింది. 
మరిన్ని వార్తలు