విడదీయొద్దు

13 Aug, 2016 22:07 IST|Sakshi
హాజరైన ప్రజాప్రతినిధులు
  •  గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్‌లో కలపొద్దు
  •  ఇప్పటికే ముంపు మండలాలతో జిల్లా నష్టపోయింది..
  • మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
  • సాక్షిప్రతినిధి, ఖమ్మం:
    జిల్లాలోని ప్రాంతాలను విడదీయొద్దు.. ఇప్పటికే పోలవరం ముంపు మండలాలు ఆంధ్రాలో కలవడంతో నష్టపోయాం.. జిల్లా విభజన పేరుతో మరోసారి గార్ల, బయ్యారం మండలాలను వేరే జిల్లాల్లో కలపొద్దు.. ఈ మండలాలను కొత్తగూడెం లేదా ఖమ్మం జిల్లాలోనే ఉంచాలి.. అంటూ హైదరాబాద్‌లో శనివారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో కోరారు.
     జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం శనివారం రాజధానిలో జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించింది. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, సభ్యులైన మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కష్ణారావు, కడియం శ్రీహరిలు జిల్లా పునర్విభజన సమీక్షలో పాల్గొని ప్రజాప్రతినిధులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. ఈ మేరకు వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

    • కొత్తగా ఏర్పడే జిల్లాకు భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆశీస్సులు ఉంటాయని, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పేరుతో భద్రాద్రి జిల్లాగా నామకరణం చేయాలని సూచించారు.
    •  టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో కూడా ఐదు నియోజకవర్గాలు ఒకే జిల్లాలో ఉంటాయని పేర్కొన్నాం. మేనిఫెస్టోలో భాగంగానే ఐదు నియోజకవర్గాలు ఒకే జిల్లాలో ఉండాలి.
    • ఇల్లెందు, బయ్యారం, గార్ల ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారం వచ్చే అవకాశం ఉంది. గార్ల, బయ్యారంను మహబూబాబాద్‌లో కలిపితే ఈ పరిశ్రమను జిల్లా కోల్పోనుంది. ఇప్పటికే ముంపు మండలాలతో అపార అటవీ సంపదను కోల్పోయాం. ఈ మండలాలను ఒకే జిల్లాలో ఉంచాలి.
    •  గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్‌లో కలపొద్దు.. ఇల్లెందు నియోజకవర్గం అంతా కొత్తగూడెం లేదా ఖమ్మం జిల్లాలోనే ఉంచాలి... నియోజకవర్గంలోని మండలాలను మూడు జిల్లాల్లో కలిపితే తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంత్రివర్గ ఉపసంఘం ఎదుట తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఇల్లెందు నియోజకవర్గంగా ఒకే జిల్లాలో ఉండాలన్నారు.


    డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ప్రతిపాదనలు ఇలా..
    ఉపసంఘం భేటీలో ఏ జిల్లాలోకి ఎన్ని మండలాలు వస్తాయో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రజాప్రతినిధులకు వివరించారు. ఈ ప్రతిపాదనల్లో ఖమ్మం జిల్లాలోకి 21మండలాలు, కొత్తగూడెం జిల్లాలోని 18 మండలాలు వస్తాయని పేర్కొన్నారు. అయితే వీటిలో గార్ల, బయ్యారం పేర్లు లేకపోవడం గమనార్హం. ఖమ్మం జిల్లాలోకి ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి, కొత్తగూడెం జిల్లాలోకి ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాలు ఉంటాయని తెలిపారు. గార్ల, బయ్యారం మహబూబాబాద్‌ జిల్లాలోకి వెళ్తాయని.. ఆ జిల్లా డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ప్రతిపాదనల్లో చూపించారని సమావేశంలో పేర్కొన్నారు.  ఈ సమావేశానికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, జలగం వెంకట్రావు,  కోరం కనకయ్య, బాణోతు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత హాజరయ్యారు.

     

మరిన్ని వార్తలు