జీఎస్టీపై అపోహలొద్దు

22 Jun, 2017 22:31 IST|Sakshi
జీఎస్టీపై అపోహలొద్దు

అనంతపురం : వస్తు సేవా పన్ను (జీఎస్‌టీ)పై  ఎటువంటి అపోహలు వద్దని కమర్షియల్‌ ట్యాక్స్‌ డెప్యూటీ కమిషనర్‌ కల్పన స్పష్టం చేశారు.  ఇప్పటి వరకు వస్తువులు, సేవలకు వేర్వేరుగా పన్ను ఉండేది.  కేంద్ర,  రాష్ట్రాల పరిధిల్లో వేర్వేరుగా వివిధ రకాల పన్నులు ఉండేవి. ఇకపై దేశవ్యాప్తంగా ఒకే విధనమైన పన్ను ఉంటుంది. ఇదే జీఎస్టీ. డీలరు ఒక వస్తువును  వేరే రాష్ట్రం నుంచి తెప్పించుకోడానికి అక్కడ 14 శాతం పన్ను చెల్లించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మకంపై మళ్లీ 14 శాతం పన్ను చెల్లించాలి. అంటే సదరు డీలరు మొత్తం 28 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. జీఎస్టీ ద్వారా  ఇతర రాష్ట్రాల నుంచి 14 శాతం పన్ను చెల్లించి వస్తువు తెచ్చుకుంటారో ఇక్కడ అమ్మకాల్లో ఆ పన్ను మినహాయింపు ఉంటుంది.

అంటే ఆ వస్తువుపై కేవలం 14 శాతం మాత్రమే పన్ను విధిస్తారు.  దీంతో పన్ను భారం తగ్గడంతో పాటు వస్తువుల ధర కూడా తగ్గే పరిస్థితి. ప్రస్తుతం వార్షిక టర్నోవర్‌ రూ. 7.50 లక్షల వరకు ట్యాక్స్‌ మినహాయింపు ఉంది. జీఎస్టీ అమలైతే రూ. 20 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుందని డీసీ కల్పన వివరించారు. తర్వాత రూ. 75 లక్షల వరకు  సాధారణ పన్ను (1–2.5 శాతం) ఉంటుందని స్పష్టం చేశారు. జూలైæ 1 నుంచి అమలులోకి రానున్న జీఎస్‌టీ చట్టంపై వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం ‘డయల్‌ యువర్‌ డీసీ’ కార్యక్రమం నిర్వహించింది. జిల్లాలో వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రశ్నలు, సందేహాలను  డెప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ శేషాద్రి (ఎల్‌టీఈ), సత్యప్రకాష్‌ (ఆడిట్‌)  నివృత్తి చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి..  

ప్రశ్న : 2017 జూన్‌లో కొనుగోలు చేసిన సరుకు వివరాలు క్లోజింగ్‌ స్టాక్‌గా ఫారం–1లో చూపాలా?
జి.జయకేశవప్రసాద్, పీవీసీ పైప్స్‌ వ్యాపారి, అనంతపురం
డీసీ : జీఎస్‌టీ అమలు తేదీ నాటికి ఉన్న క్లోజింగ్‌ స్టాకు వివరాలు ట్రాన్‌–1 ఫారంలో తప్పక తెలియజేయాలి.
ప్రశ్న : నెలవారి సరుకుల అమ్మకాలు విలువ సరాసరి రూ. 1–1.5 లక్షలుంటుంది. నేను జీఎస్టీలో రిజిస్ట్రేషన్‌ తీసుకోవాలా? లక్ష్మీరెడ్డి, జనరల్‌ స్టోర్స్, అనంతపురం, రామకృష్ణారెడ్డి, టెక్స్‌టైల్స్‌ వ్యాపారి, వలీసాహెబ్‌ ఉరవకొండ. బి.ఆనంద్, అనంతపురం.
డీసీ : వార్షిక టర్నోవరు రూ. 20 లక్షలు కల్గిన వ్యాపారులు జీఎస్టీలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన పనిలేదు.
ప్రశ్న : జీఎస్టీ రాకతో సిమెంటు, ఇనుము, ఉక్కు ధరలు పెరుగుతాయా? హుసేన్‌సాహెబ్, అనంతపురం
డీసీ : ప్రస్తుత వ్యాట్, సెంట్రల్‌ ఎక్సైజ్‌ చట్టాల మొత్తం పన్నులతో పోల్చినప్పుడు జీఎస్టీ చట్టంలో పన్ను తక్కువగా ఉంటుంది. దీంతో వాటి ధరలు పెరిగే అవకాశం లేదు.
ప్రశ్న : పాత చట్టాల కింద నమోదుకాని వ్యాపారులకు జీఎస్టీలో కొత్తగా ఎప్పటి నుంచి నమోదు చేసుకోవాలి?
 మురళి, వెంకటేశ్వర మెడికల్స్, అనంతపురం
డీసీ : ఈ నెల 25 నుంచి  జీఎస్టీలో నమోదు చేసుకోవచ్చు.
ప్రశ్న : ఇన్‌వాయిస్‌లో హెచ్‌ఎస్‌ఎన్‌ కోడ్‌ నమోదు చేయాలా? శంకర్‌రెడ్డి, అనంతపురం
డీసీ : కమిషనర్‌ నోటిఫై చేసిన వ్యాపారులు హెచ్‌ఎస్‌ఎన్‌ కోడ్‌ను ఇన్‌వాయిస్‌లో నమోదు చేయాల్సిన అవసరం లేదు.
ప్రశ్న : విద్యుత్‌ పరికరాలపై జీఎస్టీ పన్ను ఎలా ఉంటుంది? –కిష్టప్ప, లక్ష్మీ వెంకటేశ్వర ఎంటర్‌ ప్రైజస్, గోరంట్ల.  
డీసీ : 28 శాతం .
ప్రశ్న : జీఎస్టీలో ఇన్‌వాయిస్‌లు ఎప్పుడు అప్‌లోడ్‌ చేయాలి? రాజశేఖర్‌రెడ్డి, అనంతపురం
డీసీ : ఇన్‌వాయిస్‌లు ఏరోజుకారోజు అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే అమ్మకపు వివరాలు తర్వాత నెల 10వ తేదీలోపు, కొనుగోలు వివరాలు 15లోగా అప్‌లోడ్‌ చేయాలి.
ప్రశ్న : జూలై 1 నుంచి క్లోజింగ్‌ స్టాక్‌ అమ్మినప్పుడు వాట్‌ ఇన్‌వాయిస్‌ వేయాలా లేక జీఎస్టీ ఇన్‌వాయిస్‌ వేయాలా? - సుధాకర్‌నాయుడు, అనంతపురం
డీసీ : జీఎస్టీ ఇన్‌వాయిస్‌ వేసి జీఎస్టీ  ట్యాక్సే కట్టాలి.
ప్రశ్న : వ్యవసాయ పనిముట్లపై ప్రస్తుతం 5 శాతం మాత్రమే ట్యాక్స్‌ ఉంది. జీఎస్టీ వస్తే 28 శాతం చెల్లించాలి. మాకు భారం కదా? వేణుగోపాల్‌రెడ్డి, అనంతపురం
డీసీ : క్లోజింగ్‌ స్టాకులో వాట్‌ ఇన్‌ఫుట్, ఎక్సైజ్‌ ఇన్‌ఫుట్‌ శాతం వస్తుంది. జూలై 1 తర్వాత కొనుగోలు చేస్తే 28 శాతం ఇన్‌ఫుట్‌ వస్తుంది. కావున ధరల్లో పెద్దగా మార్పు ఉండదు.
ప్రశ్న : క్లోజింగ్‌ స్టాక్‌పై ఐటీసీ రావాలంటే ఎలా? మహబూబ్‌బాషా, ధర్మవరం
ఏసీ : జీఎస్టీ ట్రాన్‌–1 ఫారం భర్తీచేసి ఆన్‌లైన్‌లో పంపితే మీకు ఐటీసీ క్యారీ ఫార్వర్డ్‌ అవుతుంది.
ప్రశ్న : జూలై, ఆగస్ట్‌ నెలలకు రిటర్నులు జీఎస్టీలో వేయాల్సిన అవసరం లేదా? గోపాలకృష్ణ, అనంతపురం.
ఏసీ : స్వల్ప కొనుగోలు, అమ్మకాల వివరాలతో జీఎస్టీ 3బీ టిటర్న్‌ చేయాలి. జూలై రిటర్న్స్‌ ఆగస్టు 20లోపు, ఆగస్టు రిటర్న్స్‌ సెప్టెంబర్‌లోపు వేయాలి. ఈ అవకాశం ఒకసారి మాత్రమే.
ప్రశ్న : వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ ఉంటుందా? అనిల్, అనంతపురం.
ఏసీ : ఎంత విలువైనా వ్యవసాయ ఉత్పత్తులపై  జీఎస్టీ ఉండదు.
ప్రశ్న : ఉత్తరాఖాండ్‌ నుంచి ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ కొంటున్నాం. వాటికి ఆ రాష్ట్రంలో ట్యాక్స్‌ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీసీ వర్తిస్తుందా? రాజగోపాల్, అనంతపురం.
ఏసీ : ఉత్తరాఖాండ్‌ నుంచి కొనుగోలు చేసిన వస్తువులు ఎక్సైజబుల్‌ వస్తువులైతే జీఎస్టీ చట్టం 140 (3) ప్రకారం సదరు వస్తువుల అమ్మకాలపై చెల్లించిన సీజీఎస్టీ పన్నులో 60 శాతం ఐటీసీ తీసుకోవచ్చు.
ప్రశ్న : జేసీబీని కర్ణాటక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాం. ఆ వాహనాన్ని ఏపీలో తిప్పుకోవచ్చా? అనిల్‌కుమార్, అనంతపురం.
ఏసీ : నడుపుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్ట్‌ పనులు చేసినట్లయితే ప్రస్తుతం మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారో ఆ రాష్ట్రంలో జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ తీసుకోవాలి. జేసీబీ హైర్‌ చార్జెస్‌పై జీఎస్టీ చెల్లించాలి.

మరిన్ని వార్తలు