గురువులను ఎన్నటికీ మర్చిపోలేం

2 Jan, 2017 23:35 IST|Sakshi
గురువులను ఎన్నటికీ మర్చిపోలేం

జీవిత పాఠాలు నేర్పేది ప్రభుత్వ పాఠశాలలే
పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఎన్‌ఆర్‌ఐ బెల్లం మధు


కొక్కిరేణి(తిరుమలాయపాలెం): తమకు విద్యతో పాటు జీవిత లక్ష్యాలను నేర్పించి ఉన్నతికి పాటుపడిన గురువులను ఎన్నటికీ మర్చిపోలేమని ఎన్‌ఆర్‌ఐ బెల్లం మధు అన్నారు. మండలంలోని కొక్కిరేణి జిల్లా పరిషత్‌ పాఠశాలలో 1990–91 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను కొక్కిరేణి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇతర దేశాలలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచే స్తున్నానని, ఆనాటి ఉపాధ్యాయులు నేర్పిన విద్య, వారు చూపిన మార్గాలను నెమరవేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తమకు విద్య నేర్పిన పాఠశాలకు ఏదో ఒకటి చేయాలనే తలంపుతో కంప్యూటర్‌ విద్య బోధించే టీచర్‌ జీతభత్యాలను భరిస్తూ పాఠశాల విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు.

సర్పంచ్‌ బెల్లం శ్రీనివాస్‌ మాట్లాడుతూ సమాజానికి మంచి పౌరులను అందించే శక్తి ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే ఉందని, తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయుడు జీవిత పాఠాలు నేర్పిస్తారని గుర్తుచేసుకున్నారు. నేడు విద్యా ప్రైవేటీకరణ జరుగుతున్నప్పటికి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఉన్నతులుగా ఎదిగిన పూర్వ విద్యార్థులు పాఠశాలల అభివృద్ధికి చేయూతను అందించాలని ఆకాం క్షించారు. ఈ సందర్భంగా   విద్యనేర్పిన ఉపాధ్యాయులు శివాజీ, వెంకటేశ్వరమ్మ, సరస్వతి, వీరభద్రరావు, జ్ఞానేశ్వర్, సుధాశన్‌లను పూర్వ విద్యార్థులు  సన్మానించి, ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

వేరు వేరు ప్రాంతాలలో స్థిరపడిన వారందరూ కలుసుకుని అప్పటి పాఠశాల జ్ఞాపకాలను, కుటుంబ యోగక్షేమాలను ఒకరికొకరు గుర్తుచేసుకున్నారు.  ఉపాధ్యాయులు కూడా అప్పటి పాఠశాల ఆవరణ తరగతి గదులను గుర్తుచేసుకున్నారు.  కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పుచ్చకాయల వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు ఊడుగు కొండల్‌రావు, పూర్వ విద్యార్థులు హరిగోపాల్, ఎస్‌.కె మియా, ఎస్‌.ఉపేందర్, వీరస్వామి, శ్రీలత, కిషోర్, సురేష్, అరుణ, జ్యోతి  తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు