ఆదాయం అవసరం లేదా..?

7 Feb, 2017 01:24 IST|Sakshi
ఆదాయం అవసరం లేదా..?

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు వసూళ్లపై అధికారుల నిర్లక్ష్యం
టార్గెట్‌ 5.26కోట్లు, వసూళ్లు 1.38కోట్లు
పెద్ద ఎత్తున పేరుకుపోయిన బకాయిలు


వరంగల్‌ అర్బన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు వసూళ్లలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సానిటరీ ఇన్స్‌పెక్టర్లకు వ్యాపారులపై వల్లమాలిన ప్రేమో లేక, నిర్లక్ష్యమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2017 జనవరి 31 నాటికి వంద శాతం వసూళ్లు చేయాల్సిన సానిటరీ ఇన్స్‌పెక్టర్లు కేవలం 26 వసూళ్లతో సరిపెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని చూస్తే సొంత ఆదాయంపై వీరికి ఏ మేరకు శ్రద్ధ ఉందో అవగతమవుతోంది. కార్పొరేషన్‌ పరిధిలో 17,559 మంది ట్రేడ్‌ లైసెన్స్‌లతో యాజమానులు వ్యాపారాలు నిర్వహిస్తునట్లు రికార్డులు చూపుతున్నాయి. కానీ నగరంలో రెట్టింపు స్థాయిలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది స్థానికంగా ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా మేనేజ్‌ చేసుకుంటూ ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోకుండా తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. రికార్డుల్లో అధికారికంగా నమోదైన వ్యాపారుల నుంచి కుడా ఏడాదికోకమారు ఫీజు వసూలు చేయడంలో సానిటరీ ఇన్స్‌పెక్టర్లు విఫలమవుతున్నారు. ఫలితంగా గత కొద్ది సంవత్సరాలుగా వేలాది మంది ట్రేడ్‌ లైసెన్స్‌దారుల వద్ద ఫీజు బకాయిలు పేరుకుపోతున్నాయి.

లక్ష్యం రూ.5.28 కోట్లు.. వసూళ్లు రూ.1.38 కోట్లు
గ్రేటర్‌ వరంగల్‌ 2016–17 సంవత్సరానికి గాను ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు రూ. 5.28 కోట్ల వసూళ్ల లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్ణీత గడువు 2017 జనవరి 31 నాటికి వసూలు చేయాలని అధికారులు ఆదేశించారు. గడువు దాటింది. కానీ ట్రేడ్‌ ఫీజు కేవలం రూ. 1.38కోట్లు వసూలు చేశారు. ట్రేడ్‌ ఫీజు, జరిమానాలతో ఇంకా రూ. 3.90కోట్లు ఫీజులు బాకాయిలు పేరుకుపోయాయి. బిర్రు శ్రీనివాస్‌ అనే సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ మాత్రం 85 శాతం పన్నులు వసూలు చేయగా, భాస్కర్‌ 63శాతం, కుమారస్వామి 63 శాతం టార్గెట్‌ వసూలు చేశారు. మారో సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ యాదయ్య 15 శాతం, కర్ణాకర్‌  17శాతం, భీమయ్య 18శాతం వసూలు చేయడం గమనార్హం.
 
కొత్త డిమాండ్‌ రూ.5.51కోట్లు
ఈ ఏడాది కొత్త డిమాండ్‌ ఫిబ్రవరి 1న ఖరారైంది. పాత బకాయిలతోపాటు వడ్డీ, ఈ ఏడాది ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజుతో రూ.5.51కోట్లుగా నిర్ణయించారు. గత ఏడాది 3.90 కోట్ల బాకాయిలతో పాటు కొత్త లైసెన్స్‌ ఫీజు రూ.160కోట్లతో ఖరారు చేశారు. ఈ ఏడాది మార్చి 31లోగా చెల్లిస్తే దీనిపై జరిమానా విధించరు. కానీ మార్చి తర్వాత  3 నెలల వరకు 25 శాతం జరిమానా, ఏడాది గడిస్తే 50 శాతం జరిమానా వసూలు చేస్తారు.

 

మరిన్ని వార్తలు