సమష్టి ప్రణాళికతో ముందుకెళ్దాం

30 Jul, 2016 23:39 IST|Sakshi
సమష్టి ప్రణాళికతో ముందుకెళ్దాం
 – విధుల్లో అలసత్వం వద్దు
– 8వ తేదీ నుంచే విధులకు హాజరు కావాలి
– భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించొద్దు
– కలెక్టర్‌ విజయమోహన్‌
 
సాక్షి, కర్నూలు: 
శ్రీశైలం, సంగమేశ్వరంలో మృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు అందరూ సమష్టి ప్రణాళికతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కష్ణా పుష్కరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూడాలని సూచించారు. పుష్కర విధుల్లో ఉన్న అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి 25వ తేదీ వరకు పుష్కర విధుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో పుష్కర విధులు నిర్వహించే అధికారులందరూ సాధారణ విధులను కిందిస్థాయి సిబ్బందికి అప్పగించాలని సూచించారు. శ్రీశైల క్షేత్రానికి ఈవో నారాయణ భరత్‌గుప్తా, సంగమేశ్వర క్షేత్రానికి జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ ఇన్‌చార్జ్‌ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. వారి పర్యవేక్షణలో పుష్కర, ఏరియా అధికారులు విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు మొదటివారంలో చెక్‌లిస్ట్‌ ప్రకారం నిర్వహించాల్సి విధులపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే 8వ తేదీన కేటాయించిన ప్రదేశాలకు చేరుకుని 11వ తేదీ వరకు విధులు ఎలా చేపట్టాలన్న దానిపై ట్రై ల్‌ రన్‌ చేసుకోవాలని ఆదేశించారు. 12వ తేదీకి పకడ్బందీగా విధులకు హాజరుకావాలన్నారు. పాతాళాగంగ, సంగమేశ్వర ఘాట్ల లోతు ఎక్కువగా ఉంటుందని 4 అడుగుల మేర నీరు నిల్వ ఉండే ల్యాండింగ్‌ ఏరియాలలోనే స్నాలు చేసేందుకు అనుమతించాలన్నారు.
 
ప్రతి రోజు సమీక్ష:
 ఒక రోజు శ్రీశైలం, ఒకరోజు సంగమేశ్వరంలో పర్యటించి ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు కో–ఆర్డినేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించి ఏరోజుకారోజు ప్రణాళికలను సరిదిద్దుకొంటూ భక్తులకు అనువైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కంట్రోలు రూములో 18 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన పుష్కర విధుల అధికారులు 24 గంటలపాటు విధులు నిర్వహిస్తూ సంబంధిత ఏరియా, సిబ్బంది విధుల నిర్వహణపై పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇన్‌చార్జ్‌ అధికారి, పుష్కర అధికారులు భక్తుల సౌకర్యార్థం సొంత నిర్ణయాలు తీసుకొని తనకు తెలియజేయాలని తెలిపారు. అన్నదాన కార్యక్రమాలు చేపట్టే స్వచ్ఛంద సేవాసంస్థలను గుర్తించాలని, అలాగే వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వారు కోరిన విధంగా ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆగస్టు 4వ తేదీన సంగమేశ్వరంలో మరోసారి పుష్కర  ఏర్పాట్లపై సమీక్షిస్తానని చెప్పారు. భక్తుల భద్రతపై పోలీసు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్‌వో గంగాధర్‌గౌడ్, ఏఎస్పీ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   
 
మరిన్ని వార్తలు