విధుల్లో అలసత్వం వహిస్తే వేటు

30 Mar, 2017 21:22 IST|Sakshi
విధుల్లో అలసత్వం వహిస్తే వేటు
– జిల్లా పంచాయతీ అధికారిణి బి.పార్వతి
 
కర్నూలు(అర్బన్‌): ప్రస్తుత వేసవిలో ఈఓఆర్‌డీ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో అలసత్వం వహిస్తే వేటు తప్పదని జిల్లా పంచాయతీ అధికారిణి బీ పార్వతి హెచ్చరించారు. గురువారం ఉదయం ఆమె తన చాంబర్‌లో ఈఓఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు జిల్లాలోని ఈఓఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శులు తాము పరిచేస్తున్న ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి విధుల్లో ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్లలో యుద్ధ ప్రాతిపదికన చలువ పందిళ్లు, చలి వేంద్రాలు ఏర్పాటు చేసి శుద్ధమైన నీటిని అందించాలన్నారు.
 
 
గ్రామ పంచాయతీ ట్యాంకర్లు మినహా, ఎట్టి పరిస్థితుల్లోను అద్దె ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వీలు లేదన్నారు.   ఈ మూడు నెలలు గ్రామ స్థాయిలోని సిబ్బంది ఎలాంటి సెలవులు పెట్టకుండా జాగ్రత్తగా పని చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను కేవలం మంచినీటి సరఫరాకు ఖర్చు చేయాలన్నారు. ఏప్రెల్‌ 2వ తేదీన జరగనున్న పల్స్‌ పోలియో కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఈఓఆర్‌డీలు పాల్గొనాలన్నారు. ఈ నెల 31వ తేదీలోగా అన్ని గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్నులను వసూలు చేసేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 10 ఎంపీటీసీ, 20 సర్పంచు, 68 వార్డు మెంబర్ల స్థానాల్లో ఎలక్ట్రోల్స్‌ను ఏప్రెల్‌ 7వ తేదీన ప్రచురించడం జరుగుతుందన్నారు. సమావేశంలో కర్నూలు, ఆదోని డివిజనల్‌ పంచాయతీ అధికారులు విజయ్‌కుమార్, ఏలీషా, కార్యాలయ ఏఓ వీరభద్రప్ప పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు